Monday, April 20, 2009

వివాహం 4


శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపుడైన వరునకు పూజ
వరం అభ్యర్చ్య ........................... ఇదం వాం పాద్యం
శ్రీ లక్ష్మీనారాయణస్వరూపుడైన పెండ్లి కుమారునికి ఈ కూర్చ ఆసనము. లక్ష్మీనారాయణ స్వరూపుడవైన ఓ వరుడా! నీ రెండు పాదములను కడుగుటకు ఈ ఉదకము సుమా! అని ముందు కుడి కాలు, తరువాత ఎడమకాలు కడగాలి.
పెండ్లి కుమారుడు, అతని తరఫు పెద్దలు పెళ్ళికి తరలి వచ్చిన తరువాత కన్యాదాత సకుటుంబ సపరివారంగా సకల మంగళ వాద్య ఘోషలతో సమస్త సుగంధ పూజా ద్రవ్యములతో వారి దగ్గరకు వెళ్ళి వరపూజ చేస్తాడు.

శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపుడైన వరునికి ఈ క్రింది మంత్రంతో పాదప్రక్షాళణ చేస్తాడు.
ఓం నమోస్తు అనంతాయ ........ యుగధారిణే నమః
వేల కొలదీ రూపాలు, పాదాలు, కన్నులు, తలలు, తొడలు, బాహువులు, నామాలు, కిరీటాలు ధరించిన అనంతుడైన శాశ్వతుడైన పురుషోత్తమునకు నమస్కారం చేస్తున్నాను. కన్యను వారించడానికి మృగశిరా నక్షత్రంలో పెద్దలను పంపితే కన్యాదాత గౌరవానికి వాళ్ళు పాత్రులు అవుతారు. కార్యసిద్ధి కలుగుతుందని ఆపస్తంబ గృహ్య సూత్రం చెబుతోంది. దీనిని ఈనాడు వరాన్వేషణకు కూడా అన్వయించుకోవచ్చు. లక్ష్మీనారాయణ స్వరూపుడవైన ఓ వరుడా!ఇవి సుగంధ ద్రవ్యములు.అలంకార నిమిత్తం అక్షతలు. ఇవన్నీ నాశానరహితములై ఉండుగాక! అని వరునకు అర్చన చేయవలెను.

కాళ్ళు కడుగుట
లోకంలో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకు కాళ్ళు కడిగి పూజ చేయడం పరిపాటి. కాని ఇక్కడ వయస్సులో పెద్దవాడైన కన్యాదాత, అతని భార్య వరుని కాళ్ళు కడిగి పూజించి కన్యాదానం చేస్తారు. ఏమిట విశేషం? ఇందులో కన్యాదానం చేస్తున్నది శ్రీలక్ష్మీనారాయణ ప్రీతికోసం. వరుని  సాక్షాత్తు శ్రీలక్ష్మీనారాయణ స్వరూపుడుగా భావించమని సంప్రదాయం చెబుతోంది. కాబట్టి చిన్న వాడైన  అతనిలో గల శ్రీ లక్ష్మీ నారాయణుడికే కాళ్ళు కడగడం, పూజ చేయడం అని తెలుసుకోవాలి. అనగా భగవత్ మయంగా ఈ ప్రపంచాన్ని భావించాలి.

మన పెద్దవాళ్ళు ఏ పని చేసినా దేన్ని రూపొందించినా అందులో ఏదో ఒక తాత్వికభావన అంతర్లీనంగా ఉంటూనే ఉంటుంది. భారతీయ జీవన విధానంలో ఆ దృష్టి ఉండడం వల్లనే భారతీయ సంస్కృతీ ప్రపంచంలో సభ్య దేశాలన్నింటిలోనూ అద్వితీయంగా కొనియాడబడుచున్నది. పెళ్లి కొడుకు కాళ్ళు కడిగినప్పుడు ముందు కుడికాలును తరువాత ఎడమ కాలును ఇంద్రుని అంశంగా భావించి కడగాలి. తరువాత రెండు పాదాలను కలిపి కడగాలి.

కన్యాదానం
అన్ని దానాలలో కన్యా దానం చాలా గొప్ప దానం. ఇది మహా దానాలలో చేరుతుంది. కన్య తండ్రి కన్యాదానం చెయ్యబోయే ముందు ఇలా అంటాడు.

శ్లోకం:-
కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం.................... ప్రయతోహం ప్రయచ్చామి ధర్మకామార్ధ సిద్ధయే

బంగారంతో కూడుకొని ఉన్న, సర్వాభారణములతో అలంకరింపబడిఉన్న ఈ కన్యను నాకు బ్రహ్మలోక ప్రాప్తికి విష్ణు స్వరూపుడవైన నీకు ఇస్తున్నాను. ఓ అమ్మాయీ! మా ఎదుట ఉంది మీ తల్లికి చేదోడు వాదోడుగా ఉండే దానవు. ఓ అమ్మా! నాకు సమస్త సుశ్రూషలూ చేసేదానవు. అటువంటి నిన్ను దానం చేసి మోక్షం పొందాలనుకొంటున్నాను. శ్రీ మహావిష్ణువు, పంచ మహాభూతములు, బ్రహ్మాది దేవతల సాక్షిగా, పితృ దేవతలు తరించే నిమిత్తం ఈ కన్యాదానం చేస్తున్నాను. అలంకారములతో ఉన్నదీ సత్ స్వభావం గల ఈ కన్యను నిశ్చలమైన మనస్సుతో బుద్ధిమంతుడైన, సత్ప్రవర్తకుడైన వరునకు ధర్మార్ధ కామములు సిద్ధించడానికి ఇస్తున్నాను. సర్వాలంకార శోభిత, సాధ్వి, సుశీల, అయిన ఈ అమ్మాయిని ధర్మార్ధకామాలనే పురుషార్ధాలు సిద్ధించడానికి నియమ పూర్వకంగా ఈ బుద్ధిమంతునకు దానం చేస్తున్నాను. ఇదివరకటి వలెనే వధూవరుల గోత్రప్రవరలను చెప్పి వరుని చేతిలో జల ధారను పోస్తూ "నీతో కలిసిమెలసి అర్ధాంగిగా ఉండి సంతానాన్ని కని నీ వంశాన్ని వృద్ధి పొందించడానికి ఈ కన్యను నీకు దానం చేస్తున్నాను" అని చెప్పి వధువు తల్లిదండ్రులు కన్యాదానం చేస్తారు. వరుడు కన్యను పరిగ్రహించడం జరుగుతుంది. దానం సఫలం కావడం కోసం దక్షిణ సమర్పించబడుతుంది. అటు తరువాత సాలగ్రామ దానాన్ని కూడా చేస్తారు. కన్యాదాత వరునితో బాబూ! నీకు ఈమె అర్ధాంగి. ధర్మమైనా, అర్ధమైనా, కామమైనా మీరిద్దరూ కలిసి సంపాదించాలి. ఈమెను అతిక్రమించి వెళ్ళకు. అని పల్కిన తరువాత వరుడు అతిక్రమించను అని వారికి మాట ఇస్తాడు. (నాతిచరామి అంటాడు.)
మధుపర్కం
పెరుగు, తేనె సమంగా కలిపి ఒక కంచు పాత్రలో పోసి దానిపై కంచు మూత పెట్టి దారాలతో గట్టిగా బంధిస్తారు. దీనినే మధుపర్కం అంటారు. కొందరు దీనిలో నెయ్యి కలపాలని ఇంకొందరు దీనిలో అటుకులు కూడా కలపాలని కూడా చెబుతారు. ఈ మధుపర్కం ప్రధానంగా చేసే పూజ కాబట్టి దీనికి మధుపర్కపూజ అని పేరు వచ్చింది. కన్యాదాన కాలంలో వరునికి మధుపర్కం ఇస్తారు. ఇది గొప్ప గౌరవమన్న మాట. వధువు తండ్రి వరుని కాళ్ళు కడిగి అర్ఘ్యం ఇచ్చి మధుపర్కం ఇస్తాడు.వరుడు మధుపర్కాన్ని తీసుకొంటాడు. వరునికి వస్త్రాభరణాదులను  ఇస్తాడు.
సుముహూర్తము
ఈ సుముహూర్త కాలములో మంగలాష్టకములు, చూర్ణిక పఠించవలెను. ఇందు జీలకర్ర,బెల్లం కలిపి నూరిన మిశ్రమాన్ని వధూవరుల శిరస్సుపై పరస్పరము ఉంచుకొనుట ఆచారముగా వచ్చుచున్నది. ఇలా చేయుటలో విశేషం ఈ క్రింది శ్లోకంలో చెప్పబడుతోంది.

"జరా నో ప్రాప్యతే యస్మాత్ మంగళం శుభ కర్మసు"

ఈ జీలకర్ర ముసలితనం రాకుండా చేస్తుంది. కనుక శుభ కర్మల యందు మంగళకరమైనది. ఇది జరా ప్రతిబంధకము. సౌభాగ్య ద్రవ్యము. యౌవనాన్ని పోషిస్తుంది. కనుకనే దీనిని శిష్టులు కూడా పోషిస్తున్నారు. ఇది ఇంట ప్రశస్తమైనది కనుక మనం వంటలలో నిత్యం వాడుతున్నాము.

No comments:

Post a Comment