Wednesday, April 15, 2009

వివాహం 3


గోత్ర ప్రవరలు :-
గోత్రం అనగా వంశం. ప్రవర అనగా ఆ వంశ మూలపురుషుల కూటం. వరుడు కన్యా అన్వేషణ చేయమని అడిగిన తరువాత కొందరు పెద్దలు వెళ్ళి కన్యా దాతకు వరుని వంశాన్ని గురించి వివరించి చెప్పడాన్ని ఇక్కడ గోత్రప్రవరలు చెప్పడం అంటారు.
అంటే వరుని ముత్తాత, తాత, తండ్రి ఎవరెవరో కన్యా దాతకి తెలియజేసి కన్య ముత్తాత, తాత, తండ్రి ఎవరెవరో తెలిసికొని "మీ కన్యను మా వరునికి ధర్మ, సంతాన ,సంపద కోసం ఇవ్వండి" అని అడగడమే ఇక్కడ ప్రధానాంశం. ఆడపిల్లలు తక్కువగా ఉండే రోజులలో ఆడపిల్ల పుట్టడంతోనే సంబంధాలు కలుపుకోవాలని ఆలోచనలు ఉండేవి. అందువల్లనే పిల్లవాడి తరఫు వాళ్ళు వెళ్ళి "పిల్లనివ్వండి అని అడగవలసి వచ్చేది".ఇప్పుడు పరిస్ధితులు పూర్తిగా తారుమారు అయ్యాయి. మీకు ఏమి కావాలన్నా ఇస్తాం. మా పిల్లను చేసుకొంటారా అని కన్యాదాత బ్రతిమాలే రోజులలో మనం ఉన్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా మూడు మారులు ప్రవర చెప్పడం జరుగుతుంది. ధర్మ కార్యముల నిమిత్తం, సంతానంనిమిత్తం, ఇటువంటి వరునకు, ఇటువంటి కన్యను కోరుతున్నాము అని అర్ధము.
వృణీధ్వం అని కన్యాదాత పలుకవలెను. కన్యాదాత అలాగే మా కన్యను ఇస్తాను అని మూడు మారులు తన అంగీకారాన్ని తెలియజేస్తాడు.
"కృతార్థాః వయం ఇతి వరం ఆవేదయేయుః" అని చెప్పెదరు.
అనగా నీకు కన్యను వేదకుటలో మేము క్రుతార్దులమైతిమి అని మధ్యవర్తులైన పెద్దలు వచ్చి తమ నిర్ణయాన్ని వరునకు తెలియజేస్తారు. ఇప్పుడు పెండ్లిలోనే దీనిని జరుపుతున్నారు.ఈనాడు సంబంధ నిశ్చయానికి ముందు వరకూ జరిగే సంప్రదింపుల కార్యక్రమమే ఇది.
"ధర్మప్రజాసంపత్యర్ధం స్త్రియం ఉద్వహే" అని వరుడు అనవలెను.
 ధర్మ కార్య నిమిత్తం, సంతాన నిమిత్తం, సంపదను వృద్ధి చేసే నిమిత్తం ఈ స్త్రీని పెండ్లి ఆడుచున్నాను అని వివాహాంగభూతమైన ద్వితీయ యజ్ఞోపవీతాన్ని ధరిస్తున్నాను అని సంకల్పం చేస్తాడు. యజ్ఞోపవీత ధారణ అయిన తరువాత కన్యాదాత కన్యాదానము నిమిత్తము మహాసంకల్పం పఠించవలెను.

మహాసంకల్ప వివరణ

మనము ప్రతిపనీ చేసేటప్పుడు కరిష్యే అనడాన్ని సంకల్పం అంటారు. మానవ జీవితంలో వివాహమనేది ఒక ముఖ్యమైన సంస్కారం కాబట్టి, కన్యను ఇచ్చే తరానికి పది తరాలు వెనుక, పది తరాలు ముందు వరకు కన్యాదాన ఫలాన్ని అనుభవిస్తారు. కావున ఇక్కడ చేసే సంకల్పం చాలా విలక్షణమైనదిగా చెప్పబడింది. కనుకనే దీనిని మహాసంకల్పం అంటారు. మహాసంకల్పం విశ్వస్వరూపాన్ని చక్కగా వివరిస్తున్నది. ఇందులో ఖగోళ స్ధితి చక్కగా వివరించబడింది.భూమండలాన్ని పరిపాలించిన షోడశ మహారాజులు, షట్చక్రవర్తులు, సప్త ద్వీపాలు, నవవర్షాలు, నవఖండాలు, దశారణ్యాలు, యాభై కోట్ల విస్తీర్ణం గల జంబూ ద్వీపం, అందులో భారతవర్షం భారతఖండంలో ఈ కన్యాదానం ఎక్కడ చేస్తున్నదీ కన్యాదాత పేర్కొంటాడు. అలాగే బ్రహ్మకాలమాన ప్రకారం యాభై సంవత్సరాలు పూర్వార్ధం గడువగా, యాభై ఒకటవ సంవత్సరంలో, మొదటి మాసంలో , మొదటి పక్షంలో, మొదటి పగటిలో బ్రహ్మకు ప్రాణాయామ కాలం ప్రస్తుతం జరుగుతున్నట్లు చెప్పి తొమ్మిది కల్పములలో శ్వేతవరాహ కల్పంలో, పద్నాలుగు మన్వంతరములలో ఏడవదైన వైవస్వత మన్వంతరంలో శాలివాహన శకంలో ఇరవై ఎనిమిదవ మహా యుగంలో కలియుగంలో ఫలానా సంవత్సరంలో ఫలానా మాసంలో ఫలానా తిథి రోజున ఈ సుముహూర్త సమయంలో శ్రీ లక్ష్మీనారాయణ ప్రీతి కోసం సర్వాలంకార భూషిత ఐన ఈ కన్యను దానం చేస్తున్నాను.

ఈ కన్యాదానం వలన నాకు బ్రహ్మలోకంలో నివసించే యోగ్యత సిద్ధించాలి. అగ్నిష్టోమ, వాజపేయాది యాగాలు చేసిన పుణ్య ఫలం లభించాలి. నాకు వెనుక,ముందు పది తరాల వాళ్ళు బ్రహ్మ లోకంలో నివసించాలి. అని కన్యాదాత సంకల్పం చేస్తాడు. వివాహ సమయంలో చేసే మహా సంకల్పంలో మనం అర్ధం చేసుకోవలసిన విషయం ఏమిటంటే మహాకాలంలో, మహావిశ్వంలో మానవుడు ఎంత చిన్నవాడో అర్ధం చేసుకోవడానికి అహంకారాన్ని తగ్గించుకొని వినయవిధేయతలు పెంచుకొని కర్తవ్యపరాయణుడై  ధర్మానికి కట్టుబడి ఉండడానికి ఎంతో ఉపయోగపడుతుంది.

No comments:

Post a Comment