Monday, April 13, 2009

వివాహం 2


స్నాతకవ్రతం
విద్యాభ్యాసం కొరకు విద్యార్థిని గురుకులంలో చేర్చి , విద్యాభ్యాసం పూర్తి ఐన తరువాత గురువు ఆ శిష్యునకు స్నాతకవ్రతము చేసి నీకు విద్య పూర్తిఅయినది కావున నీవు తదుపరి వివాహము చేసుకొని గృహస్థాశ్రమము స్వీకరించవలెను అని స్నాతకవ్రతము చేసి గురుకులం నుండి గృహమునకు పంపించును.
గురుకులంలో బ్రహ్మచర్యాశ్రమాన్ని కష్టపడి దీక్షతో విద్యలన్నీ అభ్యసించి గృహస్థాశ్రమంలో ప్రవేశించమని గురువు ఆదేశించిన తరువాత స్నాతకవ్రతం చేయాలి.అన్ని దీక్షలను వదిలేసి క్షురకర్మ చేయించుకుని వేడినీళ్ళతో స్నానం చేసినవాడు స్నాతుడవుతాడు. అది ఈ వ్రతంలో ముఖ్య క్రియ కాబట్టి దీనికి స్నాతక వ్రతమని పేరు.ఇట్టి స్నాతక వ్రతములు నలందా, తక్షశిల మొదలగు విశ్వవిద్యాలయాలలో ఆచరించేవారు.దీన్ని ఈనాడు విశ్వవిద్యాలయాలలో స్నాతకవ్రతమని నామమాత్రంగా జరుపుతున్నారు.తైత్తిరీయోపనిషత్తు స్నాతకునికి గురువు చేయవలసిన ఉపదేశాన్ని ఇలా పేర్కొంటున్నది.

మంత్రం:- వేదమనూచ్యాచార్యో అంతేవాసినమనుశాస్తి సత్యంవద ధర్మంచర స్వాధ్యాయాన్మా ప్రమదః

వేదాధ్యయనం పూర్తి చేయించి గురువు శిష్యుణ్ణి ఇలా శాసిస్తున్నాడు.సత్యం మాట్లాడు. ధర్మాన్ని ఆచరించు.నేను నేర్పిన విద్యను తిరిగి అధ్యయనం చేయడంలో అశ్రద్ధ చేయకు. ఆచార్యునికి ఇష్టమైన గురు దక్షిణను సమర్పించి నీ వరకు వచ్చిన మానవ సంతతి అనే దారాన్ని తెంపి వేయకు.అంటే గృహస్థాశ్రమాన్ని స్వీకరించి యోగ్యమైన సంతానాన్ని, విజ్ఞానాన్ని ఉపదేశించి విద్య సంతతిని కూడా పెంపొందించు.అయితే ఈ గృహస్థాశ్రమ నిర్వహణ చాల కష్టమైంది.ఎన్నో భ్రమలు, పొరబాట్లు రావడానికి అవకాశం ఉంది. కనుక నైపుణ్యాన్ని ప్రదర్శించడంలో పొరబడకు.అభ్యుదయ సాధనలో పొరబడకు.వేదాన్ని అధ్యయనం చెయ్యడంలోను లేక జ్ఞానాన్ని సంపాదించడం లోనూ ఇతరులకు వేదాన్ని నేర్పడంలోనూ లేక ఇతరులకు విజ్ఞానాన్ని ఉపదేశించడంలోను ఏమరుపాటు పడకు.

మంత్రం:-మాతృ దేవో భవ, పితృ దేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ
తల్లిని దైవంగా అర్చించు.తండ్రిని దైవంగా ఆరాధించు. గురువునుదైవంగా గౌరవించు.అతిథిని దైవంగా ఆదరించు.

యాని అనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని. నో ఇతరాణి. యాని అస్మాకగ్0  సుచరితాని తాని త్వయా ఉపాస్యాని. నో ఇతరాణి

మంచి పనులను, మహనీయులు చెప్పిన వాటిని ఆచరించు. చెడ్డ పనుల జోలికి పోవద్దు. మేమాచరిస్తున్న మంచి పనులను నీవు కూడా ఆచరణలో పెట్టు. ఇతరమైన వాటి జోలికి పోవద్దు. మనదగ్గరికి శ్రేయోభిలాషులు, బ్రహ్మజ్ఞానంతో ప్రకాశించే బ్రాహ్మణులు వస్తే వాళ్ళను ఆహ్వానించి ఆతిథ్యమిచ్చి ఆదరించు. ఏదైనా ఎవరికైనా ఇచ్చేటప్పుడు శ్రద్ధతో ఇవ్వు. అశ్రద్ధతో ఇవ్వద్దు. నీ సిరిసంపదలకు తగినట్లు దానం చెయ్యి.అయ్యో!ఇంతే ఇవ్వగలుగుతున్నానే అని సిగ్గు పడుతూ ఇవ్వు. భయపడుతూ ఇవ్వు. తీసుకొనే వ్యక్తిలో భగవంతుణ్ణి చూస్తూ ఇవ్వు.
నీవు చేసే సత్కార్యాలలో గానీ, నీ నడవడిని గురించి గానీ సందేహాలు కలిగినప్పుడు నీతో పాటు దార్మికజీవనాన్ని గడుపుతూ సమభావన కలిగి భగవద్భక్తితో, ధర్మబద్ధమైన కోరికలతో ఏ లోపం లేకుండా చక్కని వివేకంతో ప్రతి విషయాన్ని విమర్శించి ఒక నిర్ణయానికి రాగల బ్రహ్మజ్ఞానులైన పెద్దలు, ఆ పరిస్ధితులలో ఎలా ప్రవర్తించారో తెలుసుకొని నీవుకూడా అలాగే ప్రవర్తించు.
ఇక ఇతరులలో తప్పులు కనపడినప్పుడు, వాళ్ళను నిందించాల్సివచ్చినప్పుడు కూడా సమభావనతో దైవభక్తితో ధార్మికమైన అభిలాషలతో ఏ లోపం లేకుండా ప్రతి విషయాన్ని విచక్షణా జ్ఞానంతో విమర్శించి నిర్ణయించగల బ్రహ్మజ్ఞానులైన బ్రాహ్మణులు ఆ సందర్భంలో ఎలా నడచుకోన్నారో తెలిసికొని నీవు కూడా అలా ప్రవర్తించు. ఇదే మా ఆదేశం.ఇదే మా ఉపదేశం. ఇదే వేదసారభూతమైన ఉపనిషత్. ఇదే మా అనుశాసనం. ఇలాగే సాధన చెయ్యి.ఇలాగే సంస్కారాన్ని పెంచుకొంటూ మళ్ళా మళ్ళా సాధన చెయ్యి.
ఆహా!ఎంత చక్కటి ఉపదేశం. ప్రాచీన భారతదేశంలో బ్రహ్మచర్యాన్ని చక్కగా పూర్తిచేసి విద్యలను సంపాదించి పెండ్లి చేసుకొని గృహస్థుగా మారి ఈ సమాజసేవకు అంకితమయ్యే అంతేవాసికి గురువు చేసే ఉపదేశమిది . అతడి బ్రతుకుకు ఆచార్యుడు వేసే బంగారు బాట ఇది. విద్యా బుద్ధులతో నీతి నియమాలతో, భక్తి విశ్వాసాలతో, సేవా సంస్కారాలతో తన శిష్యుణ్ణి తీర్చిదిద్ది ఈ సమాజానికి అంకితం చేస్తున్నాడు గురువు స్నాతకోత్సవంలో. ఒక్కసారి ఆలోచిచండి.!భారతీయ సంస్కృతి ఎంత ఉదాత్తమైన విలువలతో నిండి ఉన్నదో!
స్నాతక సమయంలో ఆచార్యుడు అందించిన ఉపదేశంలో "ఇంత వరకూ నీ వంశస్దులు మంచి సంతానాన్ని సమాజసేవ కోసం అందిస్తూ వచ్చారు.భావి జీవితాన్ని భాసురంగా తీర్చిదిద్దుకొని ఇతరులకు సేవ చేసే విజ్ఞానాన్ని సంపాదించావు కాబట్టి నీ వరకు వచ్చిన ఈ సంతాన లతను త్రెంచివేయకుండా నీ పితరుల ఋణాన్ని తీర్చుకోవడానికి మంచి సంతానాన్ని పొందాలి. అందుకోసమే గృహస్దాశ్రమాన్ని స్వీకరించు!అనే మాటలకు కట్టుబడి ఆయన అనుమతిని తీసుకొంటాడు. స్నాతకుడు ఆ తరువాత గురు దక్షిణతో పాటు ఆవు, దూడ, ఎద్దు మొదలగు వాటిని ఆయనకు సమర్పించి అప్పటినుంచి ఒక సంవత్సరం వ్రతదీక్షలో ఉంటాడు.

కాశీ ప్రయాణం
కాశీ యాత్రకు బయలుదేరిన స్నాతకుడిని కన్యాదాతగానీ, లేక పెండ్లికుమార్తె సోదరుడు గానీ, "సర్వాలంకార భూషిత ఐన మా కన్యను మీకిచ్చి వివాహం చేస్తాము.అగ్ని సాక్షిగా పాణిగ్రహణం చేయండి.దయతో మా ఇంటికి రండి " అని ఆహ్వానిస్తాడు. అందుకు అంగీకరించి వరుడు ఇంటికి బయలు దేరుతాడు.

వరాగమనం
సుముహూర్తం నిశ్చయమైన తరువాత తగినంత ముందుగా వరుడు బంధుమిత్రులతో కలిసి మంగళ గీతవాద్యాలతో ,శుభ శాకునాలతో కన్యాదాత ఇచ్చిన విడిది ఇంటికి తరలి వెళ్ళడమే వరాగమనం అంటారు. అతని వెంట పెద్దలు, బ్రాహ్మణులు , ముత్తైదువులు, బంధువులు, మిత్రులు కూడా బయలుదేరి వెడతారు.

ఈ మొత్తం కార్యక్రమాన్ని ఈ క్రింది శ్లోకములతో వివరించవచ్చు.

1.చరితబ్రహ్మచర్యోహం కృత వ్రత చతుష్టయ:

కాశీ యాత్రాం గమిష్యామి అనుజ్ఞాం దేహిమే శుభాం

౨.సాలంకారాం   మమ సుతాం కన్యాం దాస్యామి తే ద్విజ

పాణిం గృహీత్వా సాగ్నిస్త్వం గచ్చస్వ  ఆగచ్చ మద్గృహం

వివాహ సంస్కార విమర్శ

ధర్మ, అర్థ, కామ, మోక్షములనేవి పురుషార్ధములు నాలుగు.అతిశయముగా పొందబడేవి గనుక వీటిని పురుషార్ధములు అంటారు.ఇందులో ధర్మ, అర్థ, కామములకు వివాహం ఏర్పాటు అయ్యింది. మోక్షమునకు స్త్రీ సహాయం ఆపేక్షించనక్కరలేదు. మిగిలిన ధర్మ, అర్థ, కామములనే మూడు పురుషార్ధములకు స్త్రీ సంబంధం ఆపేక్షించాలి.  

వరుడు పాణి గ్రహణాఖ్యం కర్మ కరిష్యే. అని పాణిగ్రహణానికి సంకల్పం చేసి, పాణి గ్రహణాంగత్వేన వరాన్ ప్రేషయిష్యే

మదర్థం కన్యాం వృణీధ్వమితి చతురో బ్రాహ్మణాన్  శ్రుత శైలి విత్త సంపన్నాన్, సమవేతాన్ కార్య కుశలాన్ వరాన్ ప్రహ్ణీయాత్ .
నాకు తగిన కన్యను అన్వేషించే నిమిత్తం నలుగురు బ్రాహ్మణులను పంపుచున్నాను.
మంచి హృదయం గలవారు ఉభయ పక్షముల క్షేమం కోరేవారు, వేదవేత్తలు, మంచి ఆలోచనాపరులైనవారు, అయిన పెండ్లి మాటలు మాట్లాడే బ్రాహ్మణులను తనకు తగిన కన్యను వెదకి తీసుకొని రమ్మని పంపాలి.

నా నిమిత్తం కన్యను వరింపుడు అని వారికి దారి ఖర్చులు వగైరాలకు హిరణ్యం ఇవ్వడం ఆచారంగా ఉంది. దీనినే కన్యావరణం అంటారు.ఈ రకంగా నలుగురిని ఎన్నుకుని పంపాలి. కన్యావరణం అనగా మంచి లక్షణాలు గల కన్యను నిర్ణయించుకోవడం. ఇద్దరు లేక నలుగురు లేక ఎనిమిది మంది యోగ్యులు గృహస్థులైన మిత్రులను వరుడు తన కోసం మంచి కన్యను విచారించి నిర్ణయించమని కోరతాడు. అతని కోరిక మేరకు వాళ్ళు వెళ్ళి విచారించి తగిన కన్యను నిర్ణయిస్తారు.

మంత్రం:ప్రసుగ్మంతా ........ దేవః

అనే మంత్రములను చెప్పుచూ ఆ నలుగురూ కన్యాదాతను సమీపించి వరుని ప్రవరాదులు (గోత్ర , నామాలు )చెప్పాలి.





No comments:

Post a Comment