Thursday, April 23, 2009

వివాహం 9


నేను రేతస్సును ఉంచువాడను. నీవు ఆ రేతస్సును గ్రహించుదానవు. నేను మనస్సు వంటి దానను . నీవు వాక్కు వంటి దానవు. మనోవాక్కులకు కూడా అవినాభావ సంబంధము ఉన్నది. కనుక మనమిద్దరమూ అవినాభావ సంబంధముగలవారమై అన్యోన్యానురాగముతో సంచరింతుము గాక! ఓ ! సత్య వాక్కులు గల దానా! నీవు నాచే చేయబడు ధర్మకార్యములందు అనుకూలముగా సంచరిస్తూ ఉత్తమమైన ఆచరణ భోగభాగ్యములు గల సంతానము పొందుటకై నా సమీపమునకు రమ్ము. వదూవరులకు అన్యోన్యము, సఖ్యమును చేకూర్చుటకు ఈ ప్రకరణము చెప్పబడినట్లు తోస్తోంది. ఈ విషయం వ్యాకరణ శాస్త్రంలో "సాప్తపదీనం సఖ్యం" అని చెప్పబడింది. అనగా ఏడు పరములచే స్నేహం పొందుతారని నిర్వచనం చేయబడింది.

ఇక్కడ పద శబ్దానికి మాటలకూ, అడుగులకూ కూడా అర్ధం ఉంది. ఇక్కడ వదూవరులకు ప్రాధమిక స్నేహంలో సిగ్గుచేత ఏడు మాటలు సంభాషించడం అసంభవం. కనుక ఏడడుగులు నడిపించుట చేత సఖ్యం చేకూరుతుందనే ఉద్దేశ్యంతో స్నేహం కోసం ఈ సప్తపది చెప్పబడింది. సాధారణంగా మనకు ఎన్నడూ పరిచయం లేని వారితో ఏవో ఏడు మాటలు మాట్లాడడం చేత స్నేహం కలుగుతోంది.

సప్తపది అంటే ? ఒక పళ్ళెంలో బియ్యం పోసి ఏడు పసుపు కొమ్ములు వరుసగా వాటి మీద ఉంచి ,వాటిపై "ఏకమిషే విష్ణుస్త్వాన్వేతు" మొదలైన ఏడు మంత్రములచేత క్రమంగా ఆవలనుండి పాదము చేత ఏడడుగులు వేయించడం సప్తపది. ఇదీ గాక వివాహంలో వధూవరులు పెండ్లి గృహాన్నుండి విడిదిలోనికి పోవునప్పుడు విడిది గృహం నుంచి పెండ్లి గృహానికి వెళ్ళేటప్పుడు వీధి గుమ్మం దగ్గర స్త్రీలు వారిని లోనికి పోకుండా నిరోధించి వరునిచే వధువు పేరు, వదువుచే వరుని పేరు చెప్పించిన తరువాత లోనికి పంపుతారు. ఇది ఆపాతతః కేవలం లౌకికముగానూ, గతానుగతికంగానూ వస్తూ ఉన్న ఆచారంగా కనబడుతుందే కాని ,శృతి మూలకం కాదని తోచవచ్చు. కానీ ఈ ఆచారానికి మూల భూతములైన ,శ్రుతిస్మృతులను పరికిస్తే మన సంస్కారాలు గూఢంగా ఆచరణలో ఉన్నాయని తెలుస్తోంది. వివాహ సంస్కారం ధర్మార్ధ కామ రూపములైన మూడు పురుషార్ధములకే ఏర్పడింది. ఈ మూడు పురుషార్ధములు కూడా భార్యాభర్తల స్నేహం మీద ఆధారపడి ఉన్నాయి. అందుచేత సప్తపది మొదలుకొని స్నేహ సంపాదకములైన మంత్రజపాదులు విహితమై ఉన్నాయి.వివాహంలో తలుపుల దగ్గర పరస్పరం వారి పేర్లు చెప్పడం స్నేహం కోసమని స్పష్టమైంది. వ్యాకరణ శాస్త్రంలో వివాహానంతరం కళత్రం పేరు చెప్పకూడదని ఉంది.
"ఆత్మ నామ గురోర్నామ నామాతి కృపణస్యచ శ్రేయస్కామో న గృహ్ణీయాత్ జ్యేష్ఠాపత్య కళత్రయోః"

వివాహంలో శేషహోమ పర్యంతం సఖ్యతకోరకు చెప్పవలెనని పెద్దలంటున్నారు.
వధూవరుల సహపంక్తి భోజనము
"మాత్రా సహా ఉపనయనే వివాహే భార్యయా సహా
అన్యత్ర సహా భుక్తిస్చేత్ పతిత్యం ప్రాప్నుయాత్ నర:

శుభిక (భాశికం)
ఈ భాశికమునకు వేదములో ఈ విధముగా చెప్పబడింది.
"శుభికేశిర ఆరోహ శోభయన్తీ ముఖం మమ ముఖగుం హిమమశోభయ భూయాగుం సంచభగం కురు"
ఓ భాశికమా! మా శిరమున భాసించుము. నా యొక్క ముఖమునకు, మాకు, హిమవంతుని వంటి చల్లదనమును, మంచి ఐశ్వర్యమును ఇమ్ము. ఈ మంత్రమును కార్యాన్తమందు మంగళ హారతి నందు చెప్పుచున్నారు. 

కొత్నాలు
రెండు బుట్టలతో ధాన్యము వధూవరుల ఎదుట పెట్టి , ముత్తైదువులు దంచి ఆ ఊకను వధూవరుల నెత్తి మీద పల్లెరములలో చెరుగుతారు. తరువాత తలలకు చమురు పెడతారు. తరువాత వేరే బట్టలు కడతారు. మధుపర్కాలను చాకలికి వేసి , తొందరగా ఆరవేసి తీసుకువచ్చే ఏర్పాటు చెయ్యాలి. కొత్నాలు దంపిన రోకల్లతో ముత్తైదువులు వధూవరుల నాభి స్థానమునందు తాకిన్చవలెను. దీనివలన ఉదార రోగములు నసింపబడునని పెద్దలు చెప్పుదురు. వివాహ సమయంలో కాళ్ళగోళ్ళు ఆచారములో ఉన్నది. గోళ్ళు పంటితో కొరుకుట దురాచారము. ఆయుధంతో తీయుట సదాచారము. గోతిలో విషముండునని వాటిని తొలగించేదరు.

నీలలోహిత ధారణము
దేవేంద్రునికి ప్రియపత్ని అయిన ఓ ఇంద్రాణి! నీకు నమస్కారము. నాకు వివాహమును, భాగ్యమును, ఆరోగ్యమునూ, పుత్రలాభమును, ప్రసాదించెదవు గాక! అని ప్రార్ధించి నీలలోహిత పూజను చేసి "నీలలోహితే........... బధ్యతే" అనే మంత్రాన్ని చెప్పి ముత్యముల చేతనూ, పగడముల చేతనూ, కూర్చబడిన సూత్రమును కట్టాలి.

మట్టెలు

ఈ మట్టెలను నూపురములు, పాద అంగుల్యాభరణములు అని కూడా అందురు. వీటిని గూర్చి రామాయణములో కిష్కింధ కాండలో సీతాదేవి వస్తువులను రామునకు సుగ్రీవుడు చూపినప్పుడు ఆ వస్తువులు లక్ష్మణునకు చూపగా పరీక్షించి చూచి

"రామ! నాహం జానామి కేయూరే నాహం జానామి కంకణే నూపురేతు అను జానామి నిత్యం పాదాభి వందనాత్"
అనే మాటలు లక్ష్మణుడు చెమ్మగిల్లిన కళ్ళతో అనెను. అనగా సౌభాగ్యవతులైన స్త్రీలకు ఈ మట్టెలు సౌభాగ్య అలంకారములైనవి.

No comments:

Post a Comment