Monday, July 6, 2009

సన్మాన పత్రము

బ్రహ్మశ్రీ విద్వన్మణి దుడ్డు శ్రీరామచంద్రమూర్తి వర్యులకు సమర్పించు స్తుతిరత్నమాల
స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధన నామసంవత్సర చైత్ర బహుళ పంచమీ అనగా ది.వి 10/04/1985 వ తేది బుధవారం రోజున జరిగిన సన్మాన సభలో సమర్పించిన స్తుతి రత్నమాల .ఆర్ష కవితా శాఖలపై ఆదికవి వాల్మికి ఆలపించిన మధుర రామ చరితను రమ్య మాధురీ ఝరులతో ముంచెత్తించి మందాకినీ సత్య విపంచి వీచికలు పర్వగా , లక్ష్మీ నారాయణ పాదసేవా లబ్ధ వచో విజృంభమాణ భాషా నైపుణ్యంతో విపుల వ్యాఖ్యానంతో పదునెనిమిది మాసములు రామాయణేతిహాస కేదారాన్ని శృతి స్మృతి పురాణాగమాలంకార విశేషాలతో ధారావాహికంగా పరిపూర్ణం చేసి ప్రవచనం సాగించిన ధన్యమూర్తి! సద్గురు కరుణా ప్రేరణలచేత చైతన్య వంతమైన హృదయంతో సుందర హనుమద్వైభవ విభావాతిశయంతో శ్రీ హనుమత్సీతారామ పాదారవింద ధ్యాన తత్పరులై  యదృచ్ఛాలాభ సంతుష్టులై "శివమస్త్వనంతోస్త్వఖిలమస్తు" అను పరమ సంతుష్ట శాంత మూర్తి పండిత బ్రహ్మశ్రీ విద్వన్మణి దుడ్డు శ్రీరామచంద్రమూర్తి గురు వరేణ్యులకు వసంత పంచమీ పర్వ సందర్భముగా వినతి పూర్వకముగా సమర్పించుకొను స్తుతిరత్నమాల.

1.సీసపద్యము 

భాషించినాడవు బహువిధ సూక్తులు
మార్మ్రోగే నీరామమండపమున
వివరించినాడవు వేల్వేల గాధలు
చిందించె నవ్వులు చెవుల నిండ
నందించి నాడవు సుందరకాండయా
గ ఫలితంబులర నీగ్రామభూమి
సాగించినాడవు సత్యరామాయణ
గాధను బహు దీర్ఘకాలమిచట


తేటగీతి
ఏమి పుణ్యంబుచే జనియించినావో
సఫలమైనది జన్మంబు సౌమ్యమూర్తి
బుధజన నిర్మల విధేయ ప్రదితకీర్తి
వేద విజ్ఞానమూర్తి పవిత్రకీర్తి


2.మత్తేభము

జననంబందితి దుడ్డు వారి వర వంశబందు విద్యానిధీ!
జననీ గర్భము ధన్యమయ్యె నిను రాజా ! రామచంద్రా! యనన్
మనసే పండెను మాదు బోంట్లకును సౌమ్యాలంకృతంబౌ భవ
ద్ఘన పాండిత్యము గాంచి మ్రొక్కితిమి సాకారేందు తేజోనిదీ

3. సీసపద్యము

 పరమ పావనమైన భరత ఖండంబున
స్ఫూర్తినొందినది ఈ పుణ్య భూమి
ఏలా నదీ పుణ్య వేలాదికంబుల
దీప్తమైనట్టిదీ దివ్య భూమి
పౌరాణికాచార్య పండిత కోటిచే
పూతమైనట్టిదీ పుణ్య భూమి
నిరతాన్న దానంబులరవిచ్చునట్లుగా
భవ్య మైనట్టిదీ నవ్యభూమి

తేటగీతి
ఇమ్మహాక్షేత్రమందె నీవిట్టి దీక్ష
నొంది సాంతంబు ధన్యత నొందినావు
శైవ విష్ణ్వాది శాస్త్రార్ధ శిక్షితుండ!
కీర్తి విసరుండ! పండితాగ్రేసరుండ!

4. తేటగీతి

వేద వేదాంత సాహిత్య వీనులందు
నిన్ను బోలిన పండితుండెన్న
తలను వంచితి స్వల్పంబు ధనము కొరకు
మలచుకొంటివి పెక్కు సన్మానములకు

5. ఉత్పలమాల

కాంచన రత్నహారములు కాంచన కంకణ తారహారముల్
కాంచుచు నాశపొంది మరి కావలెనందురు పాండితీ జనుల్
వంచన లేక నీ వచన భాగ్యము సర్వము దారపోసితీ
మంచిది నీదు జన్మయును మాన్యత నొందెను పండితోత్తమా !

6. సీసపద్యము

 కోట్లు గడించెడి కోటీశ్వరులు కూడ
నిర్ఘాంత పోయిరి నిన్నుజూచి
పుట్లు గడించెడి భూస్వాములైనను
విస్తుపోయిరి నీదు విద్యగాంచి
పాండిత్యమే లేని పామర జనములు
తనివినందిరి వచోధాటి గాంచి
సకల శాస్త్రంబులు చదివిన పండితుల్
తలల నూచిరిగ విద్వత్తు గాంచి


తేటగీతి
ఎటుల నేర్చినాడవొకద ఇట్టి విద్య
ఇది పురాకృత సుకృతియు యెంచి చూడ
ఏమి పుణ్యంబు చేసితి వమల కీర్తి !
మాన్య శాస్త్రార్ధ విజ్ఞాన ధన్య కీర్తి!

7. తేటగీతి

ఇట్టి పాండితి గ్రహించుటెట్లబ్బెనౌ
రా ! పురాణపండ రామమూర్తి
గారి శిష్యులగుట కాబోలరసి చూడ
విబుధ జన విధేయ విమల చరిత!

8. శార్దూలము

ఈ వీటన్ నినుబోలు పండితులు లేరీ నాటి కాలంబునన్
నేవేదంబు వచింప పండితుడనా నీరాజనంబిచ్చి, సు
శ్రీ వాక్యంబులు పల్క వేద పటనా జేగీయ శాలుండవా!
కైవారంబులు సల్పుచుంటినివిగో కావ్యజ్ఞ శిక్షాగ్రణీ !

రచన :- శ్రీ కేసాప్రగడ సత్యనారాయణ
సమర్పణ :- శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానం ,
పురాణ భక్త మండలి ,
కిర్లంపూడి,
తూర్పుగోదావరి జిల్లా,
ఆంధ్రప్రదేశ్ - 533431

Friday, April 24, 2009

వివాహం 10




ఐరణి(అవిరేణి )
వివాహ కాలములో కొన్ని చోట్ల వారి వారి కులాచారమును బట్టి ఐరణి అనే కులదేవతను ఆరాధించెదరు. ఇవి ముప్ఫై రెండు సంఖ్య గల రంగులు వేసిన మట్టి పాత్రలను ,32 ప్రమిదలలో ఉంచెదరు. 32 ప్రమిదలలో దీపములు ఉంచెదరు . వీటితో పాటు రెండు వసంతం పోసే పాత్రలను కూడా ఉంచెదరు.

సరస్వతీ పూజ (ఆశీస్సులు)

శ్లోకం:-
జానక్యాః కమలామలాంజలి పుటేయాః పద్మరాగాయితాః
న్యస్తా రాఘవ మస్తకేచ విలసత్కున్ద ప్రసూనాయితాః
స్రస్తా శ్యామల కాయ కాంతి కలితా యా ఇంద్ర నీలాయితాః
ముక్తా: తా: శుభదాభవంతు భవతాం శ్రీ రామ వైవాహికాః
వ్యాఖ్యానం

శ్రీరామ వైవాహికాః శ్రీరామ వివాహోత్సవ సంబందిన్యఃముక్తాః ముక్తా మనయః భవతాం శుభాదాః - శుభ ఫల ప్రదాః భవంతు. భూయసురితి ఆశీర్వాద్. నను ముక్తానాం అచేతనత్వాట్ కదం వా శుభాఫల ప్రదాత్రుత్వం ? ( మయా ఉచ్యతే సమాధానం) ఇత్యాకాన్క్షాయాం, అంతః సౌజ్ఞాభావంటి ఏతాః సుఖాదిషు సమన్వితః .ఇతి విష్ణు పురాణ ప్రామాన్యాట్ ముక్తానాం అచేతనత్వం సిద్ధ్యతి తాదృశ ముక్తా మనయః కేద్రుస ఇతి ఆకాన్క్షాయాం జానక్యాః కమలామలాంజలి పుటేయాః పద్మ రాగాయితః , జానక్యాః -జనకస్య అపత్యం స్త్రీ జానకీ ,సీతా మహాలక్ష్మీరితి అర్ధ్.రాఘవత్వే భావేత్సీతా రుక్మిణీ క్రిష్ణజన్మని ఇతి విష్ణు పురాణ ప్రామాన్యాట్ మహాలక్ష్మీరిత్యర్ధ్.తస్యాః కమలామలాంజలి పుటే అమలంచ తాత అంజలి పుతంచ అమలాంజలి పుటం కమలవాట్ అమలాంజలి పుటం ,కమలవాట్ అమలాంజలి పుటం కమలామలాంజలి పుటం తస్మిన్ నిక్షిప్తః యః ముక్తామనయ్ పద్మరాగాయితాః=పద్మరాగ మనయ్ ఇవ ఆచరింత్య్ పునః కేద్రుష ఇత్యాకాన్క్షాయాం , న్యస్తా రాఘవ మస్తకేచ విలసత్కుండా ప్ర్సూనాయితః , రాఘవ మస్తకే=స్రేరమచన్ద్రమోర్తెహ్ శిరసి న్యస్తః నిక్షిప్తా మనయ్ విలసత్కుండా ప్రసూనాయితః వికసన్ మల్లికా కుసుమానీవ ఆచరంత్య్ పునఃకేద్రుస ఇతి ఆకాన్క్షాయాం స్రస్తాశ్యామల కాయకాంటి కలితాయః ఇంద్రనీలాయితః శ్యామల కాయకాంటి కలితః నీలమేఘ శరీరస్య శ్రీరమ కాంత్యా కలితః మిలితః మనయ్ , ఇంద్రనీలాయితః=ఇంద్రనీలమనయ్ ఇవ ఆచరంత్య్ ముక్తా మనయ్ భవతాం ఆయురారోగ్య ఐశ్వర్యాది రూపమంగళం దిశతు ఇతి ఆశీర్వాద్.
                                                         శుభం భూయాత్
                                                         మంగళం మహత్
                                                            శ్రీ: శ్రీ: శ్రీ: శ్రీ: శ్రీ:

Thursday, April 23, 2009

వివాహం 9


నేను రేతస్సును ఉంచువాడను. నీవు ఆ రేతస్సును గ్రహించుదానవు. నేను మనస్సు వంటి దానను . నీవు వాక్కు వంటి దానవు. మనోవాక్కులకు కూడా అవినాభావ సంబంధము ఉన్నది. కనుక మనమిద్దరమూ అవినాభావ సంబంధముగలవారమై అన్యోన్యానురాగముతో సంచరింతుము గాక! ఓ ! సత్య వాక్కులు గల దానా! నీవు నాచే చేయబడు ధర్మకార్యములందు అనుకూలముగా సంచరిస్తూ ఉత్తమమైన ఆచరణ భోగభాగ్యములు గల సంతానము పొందుటకై నా సమీపమునకు రమ్ము. వదూవరులకు అన్యోన్యము, సఖ్యమును చేకూర్చుటకు ఈ ప్రకరణము చెప్పబడినట్లు తోస్తోంది. ఈ విషయం వ్యాకరణ శాస్త్రంలో "సాప్తపదీనం సఖ్యం" అని చెప్పబడింది. అనగా ఏడు పరములచే స్నేహం పొందుతారని నిర్వచనం చేయబడింది.

ఇక్కడ పద శబ్దానికి మాటలకూ, అడుగులకూ కూడా అర్ధం ఉంది. ఇక్కడ వదూవరులకు ప్రాధమిక స్నేహంలో సిగ్గుచేత ఏడు మాటలు సంభాషించడం అసంభవం. కనుక ఏడడుగులు నడిపించుట చేత సఖ్యం చేకూరుతుందనే ఉద్దేశ్యంతో స్నేహం కోసం ఈ సప్తపది చెప్పబడింది. సాధారణంగా మనకు ఎన్నడూ పరిచయం లేని వారితో ఏవో ఏడు మాటలు మాట్లాడడం చేత స్నేహం కలుగుతోంది.

సప్తపది అంటే ? ఒక పళ్ళెంలో బియ్యం పోసి ఏడు పసుపు కొమ్ములు వరుసగా వాటి మీద ఉంచి ,వాటిపై "ఏకమిషే విష్ణుస్త్వాన్వేతు" మొదలైన ఏడు మంత్రములచేత క్రమంగా ఆవలనుండి పాదము చేత ఏడడుగులు వేయించడం సప్తపది. ఇదీ గాక వివాహంలో వధూవరులు పెండ్లి గృహాన్నుండి విడిదిలోనికి పోవునప్పుడు విడిది గృహం నుంచి పెండ్లి గృహానికి వెళ్ళేటప్పుడు వీధి గుమ్మం దగ్గర స్త్రీలు వారిని లోనికి పోకుండా నిరోధించి వరునిచే వధువు పేరు, వదువుచే వరుని పేరు చెప్పించిన తరువాత లోనికి పంపుతారు. ఇది ఆపాతతః కేవలం లౌకికముగానూ, గతానుగతికంగానూ వస్తూ ఉన్న ఆచారంగా కనబడుతుందే కాని ,శృతి మూలకం కాదని తోచవచ్చు. కానీ ఈ ఆచారానికి మూల భూతములైన ,శ్రుతిస్మృతులను పరికిస్తే మన సంస్కారాలు గూఢంగా ఆచరణలో ఉన్నాయని తెలుస్తోంది. వివాహ సంస్కారం ధర్మార్ధ కామ రూపములైన మూడు పురుషార్ధములకే ఏర్పడింది. ఈ మూడు పురుషార్ధములు కూడా భార్యాభర్తల స్నేహం మీద ఆధారపడి ఉన్నాయి. అందుచేత సప్తపది మొదలుకొని స్నేహ సంపాదకములైన మంత్రజపాదులు విహితమై ఉన్నాయి.వివాహంలో తలుపుల దగ్గర పరస్పరం వారి పేర్లు చెప్పడం స్నేహం కోసమని స్పష్టమైంది. వ్యాకరణ శాస్త్రంలో వివాహానంతరం కళత్రం పేరు చెప్పకూడదని ఉంది.
"ఆత్మ నామ గురోర్నామ నామాతి కృపణస్యచ శ్రేయస్కామో న గృహ్ణీయాత్ జ్యేష్ఠాపత్య కళత్రయోః"

వివాహంలో శేషహోమ పర్యంతం సఖ్యతకోరకు చెప్పవలెనని పెద్దలంటున్నారు.
వధూవరుల సహపంక్తి భోజనము
"మాత్రా సహా ఉపనయనే వివాహే భార్యయా సహా
అన్యత్ర సహా భుక్తిస్చేత్ పతిత్యం ప్రాప్నుయాత్ నర:

శుభిక (భాశికం)
ఈ భాశికమునకు వేదములో ఈ విధముగా చెప్పబడింది.
"శుభికేశిర ఆరోహ శోభయన్తీ ముఖం మమ ముఖగుం హిమమశోభయ భూయాగుం సంచభగం కురు"
ఓ భాశికమా! మా శిరమున భాసించుము. నా యొక్క ముఖమునకు, మాకు, హిమవంతుని వంటి చల్లదనమును, మంచి ఐశ్వర్యమును ఇమ్ము. ఈ మంత్రమును కార్యాన్తమందు మంగళ హారతి నందు చెప్పుచున్నారు. 

కొత్నాలు
రెండు బుట్టలతో ధాన్యము వధూవరుల ఎదుట పెట్టి , ముత్తైదువులు దంచి ఆ ఊకను వధూవరుల నెత్తి మీద పల్లెరములలో చెరుగుతారు. తరువాత తలలకు చమురు పెడతారు. తరువాత వేరే బట్టలు కడతారు. మధుపర్కాలను చాకలికి వేసి , తొందరగా ఆరవేసి తీసుకువచ్చే ఏర్పాటు చెయ్యాలి. కొత్నాలు దంపిన రోకల్లతో ముత్తైదువులు వధూవరుల నాభి స్థానమునందు తాకిన్చవలెను. దీనివలన ఉదార రోగములు నసింపబడునని పెద్దలు చెప్పుదురు. వివాహ సమయంలో కాళ్ళగోళ్ళు ఆచారములో ఉన్నది. గోళ్ళు పంటితో కొరుకుట దురాచారము. ఆయుధంతో తీయుట సదాచారము. గోతిలో విషముండునని వాటిని తొలగించేదరు.

నీలలోహిత ధారణము
దేవేంద్రునికి ప్రియపత్ని అయిన ఓ ఇంద్రాణి! నీకు నమస్కారము. నాకు వివాహమును, భాగ్యమును, ఆరోగ్యమునూ, పుత్రలాభమును, ప్రసాదించెదవు గాక! అని ప్రార్ధించి నీలలోహిత పూజను చేసి "నీలలోహితే........... బధ్యతే" అనే మంత్రాన్ని చెప్పి ముత్యముల చేతనూ, పగడముల చేతనూ, కూర్చబడిన సూత్రమును కట్టాలి.

మట్టెలు

ఈ మట్టెలను నూపురములు, పాద అంగుల్యాభరణములు అని కూడా అందురు. వీటిని గూర్చి రామాయణములో కిష్కింధ కాండలో సీతాదేవి వస్తువులను రామునకు సుగ్రీవుడు చూపినప్పుడు ఆ వస్తువులు లక్ష్మణునకు చూపగా పరీక్షించి చూచి

"రామ! నాహం జానామి కేయూరే నాహం జానామి కంకణే నూపురేతు అను జానామి నిత్యం పాదాభి వందనాత్"
అనే మాటలు లక్ష్మణుడు చెమ్మగిల్లిన కళ్ళతో అనెను. అనగా సౌభాగ్యవతులైన స్త్రీలకు ఈ మట్టెలు సౌభాగ్య అలంకారములైనవి.

వివాహం 8


దదామీత్యగ్ని.........ఆదిత్యస్సత్యమోమితి ఈ కన్యను నేను దానం చేస్తున్నానని అగ్ని చెబుతున్నాడు.అలాగేనని వాయుదేవుడు అన్నాడు. అది నిజమా!నాకు ఇష్టమేనని చంద్రుడు అన్నాడు. సత్యమేనని ఆదిత్యుడు అంగీకరించాడు.
ఆపస్తత్సత్య ....................సంరుద్ధ్యతాం యజ్న దక్షిన రూపమైన కీర్తి కారణమైన ఈ కన్యను ఉదకము యొక్క దేవతలు తీసుకొని వచ్చారు. అందువలన నేను కోరిన సంతానం సమృద్ధిగా కలుగు గాక!

ఇలావరుడు తలంబ్రాలు పోసిన తరువాత వధువు వరునిపై తన దోసిలిలో తలంబ్రాలను పోస్తుంది. రెండవ సారి వెనుకటి లాగానే దోసిళ్ళలో తలంబ్రాలను నింపుకొని వధువు దోసిలిని పైన పెట్టి పై మంత్రాలను చదువుతూ చివరిలో మాత్రం ఈ క్రింది వాక్యం చెబుతూ వరునిపై తలంబ్రాలను పోస్తుంది. నాకిష్టమైన పశువులు పాడిపంటలు సంమృద్ధిగా ఉండాలి. ఇక మూడవసారి పై క్రియలన్నీ జరిగిన తరువాత వరుడి దోసిలి పైన పెట్టి ఈ క్రింది మంత్రం చెబుతూ వధువు పైన తలంబ్రాలు పోస్తాడు. నాకిష్టమైన త్యాగం సంమృద్ధిగా ఉండాలి. నాలుగవసారి మంత్రాలు లేకుండానే తలంబ్రాలు పోసుకొంటారు.కొందరిమతంలో ఈ క్రింది మంత్రంతో ఇద్దరూ ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకొంటారు. మాకు కావలసిన సిరిసంపదలు సంమృద్ధిగా ఉండాలి. మాకు కీర్తి ప్రతిష్తలు సంమృద్ధిగా ఉండాలి. అనే అర్ధం వచ్చే మంత్రాలను కూడా చెబుతారు.


రక్షాబంధనం


కంకణాలు కట్టడాన్నే రక్షాబంధనం అంటారు. భౌతికమైన ఉపద్రవాలనుంచి రక్షణ కోసం , పురుడు, మైల మొదలైనవి సోకకుండా ఉండడంకోసం , కార్య నిర్వహణ దీక్ష కోసం కంకణాన్ని కడతారు. వరుడికి కుడిచేతికి , వధువుకి ఎడమ చేతికి కంకణం కట్టాలి. జరగబోయే పాణి గ్రహణానికి ఇది అంగం.వివాహంలో మంగళప్రదమైన ఈ కంకణం వధూవరుల రక్షణ కోసం ఉద్దేసింపబడుచున్నది. ఈ కంకణాన్ని నాలుగవ రోజు రాత్రి తిరిగి ఇప్పివేయాలి.


బ్రహ్మముడులు

వివాహంలో భార్యా భర్తల వస్త్రములకు బ్రహ్మ ముడులు అను పేరుతొ ముడులు వేస్తారు. ఆ వేయుటలో అభిప్రాయం ఏమనగా ? బ్రాహ్మణ ఆశీర్వచనములను దంపతుల కొంగులలో ముడి వేయుటఅని భావము. ఈ అర్ధమును స్ఫురిమ్పజేయు మంత్రమునే "గ్రందిం గ్రద్నాటి ఆశిష ఎవాస్యాం పరిగ్రుహ్నాతి" అను శృతిచే పాటిస్తారు. తరువాత బ్రహ్మముడి సదక్షినా ఫల తాంబూలములను వధూవరుల చేలాంచలములకు కట్టి ఆ రెండు కోణాలను కలిపి ఈ క్రింది అనువాకాన్ని చెప్పుచూ ముడి వెయ్యాలి.యోగాక్షేమస్య .................. ఆశిశామేవైతామాశాస్తే బ్రహ్మగ్రంది ముహూర్తః సుముహూర్తః అస్తు. పాణిగ్రహనాన్గామగుట చేత మా ఇద్దరి సంరక్షణ నిమిత్తం రక్షలను కట్టుచున్నాను. వరుని చేతికి ఈ మంత్రం చెబుతూ పురోహితుడు కడతాడు. తరువాత వరుడు వధువు వామ హస్తమునకు కడతాడు.


బృహత్సామ ................... సగరేన రక్షా వద్వా వామకరే బధ్నాతి


సప్తపది


వివాహంలో సప్తపది ముఖ్యమైన ఘట్టము. ఓ చిన్నదానా ! నీవు నన్ను అనుసరించి నడువుము.నీవు నడిచేటప్పుడు మొదటి అడుగులో శ్రీ మహా విష్ణువు , అన్నమును, రెండవ అడుగులో బలమును, మూడవ అడుగులో ఉత్తమ కర్మమునూ ,నాల్గవ అడుగులో కర్మ ఫలమునూ,ఐదవ అడుగులో పశు సంమ్రుద్ధినీ ,ఆరవ అడుగులో రుతు సంపత్తినీ , ఏదవ అడుగులో యజ్న సాధకులైనా హోత ప్రశాస్తా, బ్రాహ్మనాచ్చంసి , పోత, నిషా, అచ్చాలూక , అగ్నేద్ధ్రులనే ఏడుగురు రిత్విక్కులనూ ప్రసాదిన్చుగాక అని అర్ధమిచ్చే మంత్రమును పతిన్చవలెను.


వధువును అగ్నికి ఉత్తరమునకు కుడి కాలితో అగ్నికి తూర్పునకుగానీ, ఉత్తరమునకుగానీ, ఏడు మంత్రములచేత ఏడు అడుగులు నడిపించి అడుగులో "సఖా సప్త పదా భావ " మొదలు ఏహి సూనృతే వరకూ చాతుస్వరముతో వరుడు జపము చేయవలెను. హోమములకు ముందు అగ్నికిని బ్రహ్మగారికిని ప్రదక్షిణం చేసి , మునుపటి వలె ఉత్తర వరుడుగా కూర్చుని వధువు తనను తగిలి ఉండగా మంత్రపూతముగా 16 హోమములు చేయవలెను. నీవు నాతొ ఏడడుగులు నడచుట వలన మన ఉభయులకు మైత్రి సిద్ధించింది. నిన్ను నేను విడువను. నన్ను నీవు విడువకు. మనము అన్యోన్య ప్రేమతో అనుకూలమైన మనస్సు, సమానమైన దాంపత్యము కలవారమై విధి విహితమైన కార్యముల యందు సమానమైన ఆలోచనలు కలిగి ఒకే మనస్సు కలవారమై ధర్మ కార్యములు చేస్తూ చరింతుము గాక! నేను సామ వేదము వలె , నీవు ఋగ్వేదము వలె, అవినాభావ సంబంధము గల వారము అగుదుము గాక! అంటే ఋక్కులను విడిచి సామం , సామమును విడిచి రుక్కు ఉండనట్లే మనం కూడా ఆకారము విడిచి ఆకారము ఉండకుండుము గాక!
నేను స్వర్గము వంటి వాడిని , నీవు భూమి వంటి దానవు. అనగా భూమి ఆధారం .స్వర్గం ఆదేయం . ఆధార ,ఆదేయములకు కూడ అవినాభావ సంబంధము ఉన్నది.

Wednesday, April 22, 2009

వివాహం 7






శ్లోకం:- మాంగల్య తంతునానేనా మమ జీవన హేతునా
కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదాం శతం

మాంగల్య ధారణ ముహూర్తః సుముహూర్తః అస్తు.

నా జీవన హేతువైన ఈ మంగళ సూత్రమును గుర్తుగా నీ కంఠమందు కడుతున్నాను. మూడు ముళ్ళూ వేస్తున్నాను. నీవు నిండు నూరేండ్లు బ్రతుకు అని ఆ వేసిన ముడులకు కుంకుమ అద్దాలి. ఈ మూడు ముడులలో 1.ధర్మ పురుషార్ధానికి సంకేతము.2.అర్ధ పురుషార్దమునకు సంకేతము. 3.కామ పురుషార్ధమునకుసంకేతము అని ఆర్యుల వచనం.

1.గత జన్మ బంధం 2.ఈ జన్మ బంధం 3.భవిష్యత్ జన్మ బంధం అని కొందరు అందురు.

అంటే!అన్యోన్య అనురాగంతో జన్మ జన్మలకు ఈ మైత్రి బంధం మన ఉభయులకూ, అలాగే సాగాలని ప్రేమ బంధం మూడు మారులు వెయ్యడం జరిగింది అన్నారు మరి కొందరు. త్రికరణయా మనసా , వాచా, కర్మణా నీ భారం వహిస్తాను. కనుక నీవు నా భార్యవు. అని మూడు ముడులు వేస్తున్నాను అని భావమన్నారు కొందరు.

ఈ మంగళ సూత్రములను తయారు చెయ్యడంలో గుండ్రని వర్తులాకారంలో మధ్యన బొటిమ వంటి దానిని నిర్మిస్తారు. ఇది స్ఫోటము. దీని విషయంలో అగ్నిచయనమనే క్రతువులో యజమాని కంఠమునకు ఇరవైఒక్క స్పోటములు కలిగిన సృవం రుక్మమును కడతారు. ఈ ఇరవై ఒక్క సంఖ్యకు కారణం ఏమిటో ఇలా చెప్పబడింది. దేవలోకములు ఇరవై ఒకటి. కనుక ఈ రుక్మమునకు ఇరవై ఒక్క స్పోటములచేత ఇరవై ఒక్క దేవలోకముల నుండి కూడా శత్రువును కనుపించకుండా చేస్తుందని శృతి చెప్పడం వలన వివాహంలో నిర్బాధం వలన ఈ లోకంనుండి శత్రువును అంతర్హితుని చేసే ఉద్దేశ్యంతో ఒక స్పోటము ప్రస్తుతం మంగళ సూత్రములకు నిర్మితమవుతోందని భావించాలి. మంగలసూత్రమును వరుడు వదువునకు అభిముఖుడై పై శ్లోకము చెప్పుచూ కంఠమందు 21 స్ఫోటములు కలిగిన సువర్ణ రుక్మమును కడతారు. కనిపించకుండా చేసే ఉద్దేశ్యంతో ప్రస్తుతం ఒక స్ఫోటముతో మంగళ సూత్రం నిర్మితమవుతోందని భావించాలి. మంగలసూత్రమును వరుడు వధువునకు అభిముఖుడై ఈ శ్లోకం చెప్పుచూ మూడు ముళ్ళు వెయ్యాలి. నీ మనస్సుకూడా ఈ బంధమందు లగ్నమై ఉండుగాక.1.మనస్సుతో 2.వాక్కుతో 3.శారీరక క్రియతో సౌమనస్యంతో ఉండుగాక.నీ భారం వహిస్తున్నాను అని భావమన్నారు కొందరు.

ఈ మూడు ముడులలో మరో గొప్ప అర్ధం ఇమిడి ఉంది.
ఓ కన్యా మన ఉభాయులద్వారా 21 తరాలు తరించాలి. ఒక ముడికి ఏడు తరముల చొప్పున మూడు ముడులకు మూడు ఏడులు ఇరవై ఒక్క తరములు కదా! వారుతరించాలి. నిన్ను నాకు నీ తండ్రి ఇచ్చేటప్పుడు మహా సంకల్పంతో ఇచ్చాడు.దశ పూర్వేషాం అనగా మనకి ముందు పది తరాలు, దశ అపరేషాం అనగా మనకి వెనుక పది తరాలు , మనతో 21 తరాలు అయినది. ఇది సార్ధకం కావడానికి ఈ మూడు ముడులు గుర్తుగా వేస్తున్నాను అని అర్ధం.
 
తలంబ్రాలు

వధూవరులు ఒకరి తలపై మరొకరు పసుపుతో తడిపిన అక్షతలను దోసిళ్ళతో పోసుకోవడాన్ని తలంబ్రాలు పోసుకోవడం అంటారు. దీనినే అక్షతారోపణం అనికూడా పిలుస్తారు. ఇది చూడడానికి చాలా వేడుకగా కనపడుతుంది. పెండ్లికి వచ్చిన బందుమిత్రులంతా వివాహంలో ఏఘట్టాన్ని చూసినా,చూడకపోయినా దీనిని మాత్రంచూడకుండా ఉండరు. తెలుగు దేశంలో ఈ సందర్భంలో ప్రత్యేకమైన సన్నాయి వాద్యం కూడా వినబడుతుంది. వీటన్నింటితో పాటు ఇక్కడ జరిగే క్రియా క్రమంలో చెప్పే మంత్రాలలో చాలా విశిష్టత కనబడుతుంది.

వరుడు వధువు దోసిట్లో ఎండు కొబ్బరి చిప్పతో రెండు మార్లు అక్షతలను పోసి పాలతో ప్రోక్షించి పెండ్లి కూతురి దోసిలి పైన పెండ్లికొడుకు దోసిలి పెడతారు. ఈ మంత్రాలను చదువుతారు. "కపిలాగుస్మారయతు...............శాంతిరస్తు " కర్రి ఆవులను స్మరించండి ! అనేక దానాలను చెయ్యండి. పుణ్యం వృద్ధి పొందాలి. శాంతి, పుష్టి, తుష్టి, వృద్ధి కలగాలి. సత్కర్మలు వృద్ధి పొందాలి. నక్షత్రాలవల్ల , గ్రహాలవల్ల, సోమునివల్ల , మన దాంపత్యం సరిగా జరగాలి. శాంతి కలగాలి. ఈ క్రింది మంత్రాలను చెబుతూ వరుడు, వధువు తలపైన మొదటి తలంబ్రాలను పొయ్యాలి.

"ప్రజాపతిః స్త్రియాం యశః..................... తస్యాగ్నే భాజఏహమా"

ప్రజాపతి భార్యలో కీర్తి కారణమైన వీర్యాన్ని వృషణాలలో ఉంచాడు. దానివలన కలిగే కామ తృప్తిని, ఆనందాన్ని మా దాంపత్యంలో కలిగించు.

 "మోదః ప్రమోదః ఆనందః ................. దక్షిణానాం ప్రతిగ్రహే"

 సంతోషం, పరవశత్వం, ఆనందం , వీటి మూడింటిని కలిసి వృషణాలలో ఉంచాడు. ప్రజాపతి దక్షిణలను స్వీకరించినప్పుడు కన్యలను పరిగ్రహించినంత తృప్తి కలుగుతుంది .

"మనసః కామమాకూతిం ............శ్రయతాం మయి"

మనమిద్దరి మనస్సుకు సంబంధించిన విజ్ఞానాన్ని, మంచి సంకల్పాన్ని, సత్యాన్ని పొందాలి. అలాగే పశుసంపద , అన్న సంపద వాటి ద్వారా వచ్చే కీర్తిని ప్రతిష్ఠను అనుభవించాలి.

యథాహమస్య ..............................కామ్యః ప్రియః

 యజ్ఞానికి ఇష్టుడనైన నేను, ప్రియురాలు ప్రియునితో ఎలా తృప్తిని పొందుతుందో అలాగే తృప్తిని పొందుతాను.




Tuesday, April 21, 2009

వివాహం 6


తరువాత ఆ కాడి యొక్క రంధ్రమందు శంతే హిరణ్యం అను మంత్రం చేత, సువర్ణమును అంతర్ధానం ఉంచాలి. సువర్ణమును పెట్టి అభిషేకం చెయ్యడానికి కారణం శృతి ఇలా చెబుతోంది.
పూర్వం వరుణుని యొక్క ఇంద్రియ సామర్ధ్యాన్ని ఉదకములు బయటకు వెళ్ళగొట్టాయి. అలా బహిర్గతమైన వీర్యం సువర్ణరూపందాల్చింది. అందుచేత ఇంద్రియసామర్ధ్యం బహిర్గతం కాకుండా ఉండడానికి సువర్ణం పెట్టి అభిషేకం చెయ్యాలని చెప్పి, తరువాత సువర్ణం నుండి స్రవించిన ఉదకములు ఆయుర్వృద్ధి హేతువులుగా బోధిస్తోంది.
హిరణ్య దానం చేత అపమృత్యువు పోతుంది. కనుక హిరణ్యం ఆయు స్వరూపం. అటువంటి హిరణ్య సంయుక్తములైన ఉదకములు ఆయువును వృద్ధి పరుస్తాయి.ఆ ఉదకములే యజమానిని గూర్చి స్రవిస్తాయి.
అలాగే హిరణ్యం దీప్తి కలది. కనుక అటువంటి హిరణ్య సంబంధం చేత తేజస్సంపాదకములైన ఉదకములే ఈ యజమానుని గూర్చి స్రవిస్తాయి. సువర్ణాభరణ సంబంధం వల్ల దేహం శోభిస్తుంది. కనుక సువర్ణ సంబంధం చేత వర్చో హేతువులైన ఉదకములు ఈ యజమానుని గూర్చి స్రవించును. ఈ విధంగా ఆయుస్సు, వర్చస్సు, తేజస్సులకు సాధనమైన హిరణ్యమును ప్రాకృతంలో కాడి యొక్క రంధ్రములో ఉంచి ఆ సువర్ణం ద్వారా స్రవించే ఉదకము వధువు యొక్క శిరస్సు యందు పడుటచే హిరణ్యము, ఉదకములు, కాడి మొదలైనవి ఆయురాది సంపాదన ద్వారా సుఖసంధాయకములని పై శృతి తెలియజేస్తోంది. ఓ కన్యా! ఈ హిరణ్యం, ఈ ఉదకములు, ఈ యుగచ్చిద్రం మొదలైనవి నీకు సుఖకరములు అగు గాక!

యోక్త్ర బంధనం
వివాహంలో ఆశాసానా అను మంత్రం చేత వధువు నడుమునకు దర్భత్రాడు కడతారు. దర్శపూర్ణ మాసేష్టులనే శ్రౌత కర్మలో ఈ మంత్రం పత్నికి యోక్త్ర బంధనం చేసేటప్పుడు చెబుతారు. ఎవని యొక్క పత్ని అగ్నికి అనువ్రతురాలవుతూ అనుసారిణి అవుతూ సౌమనస్యాన్ని, సంతానాన్ని, సౌభాగ్యాన్ని, శోభన సన్నివేశమైన శరీరాన్ని కోరుతుందో ఆ పత్నిని శోభన కర్మకు సుఖమయ్యేలా యోక్త్రం చేత బంధించుచున్నాను. యోక్త్ర బంధన సమయంలో పై మంత్రాన్నుచ్చరిస్తూ ఉండడం చేత ఈ పత్నిని యజ్ఞ  యోగ్యురాలుగానూ, పాప రహితురాలుగానూ చేసి సత్యమైన ఆశీస్సుతో సంరుద్ధురాలుగా చేయుచున్న వాడవుతాడు. ఈ విషయంలో విద్యారణ్యులవారు ఇలా వివరించారు.
"యథా వివాహే స్త్రియః కంఠే మంగళసూత్రం లింగం తద్వత్. అస్మిన్నర్థే  లౌకిక వైదిక ప్రసిద్ధిం దర్శయతి."

లోకంలో వివాహమందు స్త్రీ కంఠమందు మంగళసూత్రం ఏ వ్రత స్వీకరణ చిహ్నంగా ఉన్నదో అలాగే దర్శపూర్ణ మాసేష్టులలో పత్నికి యోక్త్ర బంధనం అనువ్రత స్వీకార చిహ్నమన్న మాట.

సామాన్యంగా సూత్రధారణం లోకంలోనూ, వేదం లోనూ కూడా నియమ స్వీకారమందు చిహ్నము. ఎలాగా అంటే లోకంలో ఎక్కడో దూరదేశ మందున్న దేవతా దర్శనాన్ని చేయ సంకల్పించిన వారు సూత్రం కట్టుకునే ఆచారం ఉన్నది.వేదంలో కూడా ఉపనయనంలో మౌంజిని (ముంజి గడ్డిచే నిర్మితమైన త్రాడును) వటువునకు కడుతున్నారు. కనుక యాగమును తెలిసినవారు, తెలియనివారు అందరూ ఇలా అంటున్నారు .ఏమని అంటే ఈ పత్ని యోక్త్రమును ముఖ్యంగా ధరించుచున్నది.ఏ భర్తను అనుసరించి ఈమె వ్రతమును స్వీకరించి ఉన్నదో అతని సంబంధమైన మంగలసూత్రముతో పరలోకమందు కూడుకొన్నది అయి ఉంటుంది. దీనివలన వివాహమందు స్త్రీకి మంగళ సూత్రం అనూచానంగా ఆచారమిచ్చినట్లు స్పష్టమవుతోంది. తరువాత ఇష్టిలో యోక్త్రమును పత్నికి ముడి వేయుట వలన ఆశీస్సులను ఈ పత్నియందు పరిగ్రహించిన వాడు అవుతాడు.

వివాహం 5


బెల్లం:-
ప్రతిష్ఠాకాముడైనవాడు  కామేష్టి యందు క్షేత్రపత్స చరువును, ఇష్టిని చెయ్యాలని శృతి విధిస్తోంది. ఇది భూమి మీద చిరకాల స్ధితిని కోరేవాడు చెయ్యాలి.

మంత్రం:-క్షేత్రస్య పతే మధుమంతం ఊర్మిం .......... మృడయంతు.
ఈ మంత్రంలో భూమిని సంబోధించడం జరుగుతోంది . ఓ భూదేవతా! ధేనువు నూతనంగా ప్రసవించిన ఆవు పాలను ఇచ్చునట్లుగా నీవు మాధుర్య రసముతో కూడినట్టి పదార్ధములను ఇచ్చుచున్నావు.

ఘృతం:- నెయ్యి వలే పర్యూషితత్వ దోషం లేకపోవుటచేత అతి పవిత్రమైన నారికేళము, ఇక్షు ఖండం, బెల్లం మొదలైన భోగ్య పదార్ధ సమూహాన్ని మాకు ఇమ్ము. యజ్ఞపతులు మమ్ములను సుఖపెట్టెదరు గాక.

ఈ మంత్రంలో భూమి దేవతను భోగ్య పదార్ధములను ఇమ్మని కోరే సందర్భంలో ఆ భోగ్య వస్తు పరంపరలో బెల్లమును కూడా పరిగణించి ఆ బెల్లమునకు నాలుగు విశేష గుణములను చేర్చారు. అవి ౧.ఆ బెల్లము మాధుర్యోపేతము. తరంగముల వలె అవిచ్చిన్నమైనది. ౨.తన మాధుర్యమును ఇతర వస్తువుల యందు సంక్రమింపజేస్తుంది. ౩. ఘృతం వలె పవిత్రమైనది.అన్నము మొదలైన వండిన పదార్దములు ఈ రోజు వండినవి మరునాటికి పనికిరావు. కనుక అపవిత్రమవుతాయి. వాటిని తింటే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అవి పర్యూషితాలు కనుక. ఘృతానికి పర్యూషిత దోషం లేదు. ఈ విధంగా బెల్లం అనేక సత్ గుణాలతో కూడుకొని ఉంది. అందు చేత ఇంత పవిత్రమైన జీలకర్ర, బెల్లాన్ని మిశ్రమం చేసి వధూవరులు పరస్పర హస్తాలతో శిరస్సున మంచి సుముహూర్త సమయంలో ఉంచడం ఆచారమై ఉంది. దీని వలన వధూవరుల శరీరంలో పరస్పరం ఒక విజాతీయమైన సంస్కారం కలుగుతుందని అనడంలో అతిశయోక్తి లేదు. ఇట్టి మార్పునకు అనుకూలమైన పరమ మంగళ పదార్ధముల సమ్మేళనము పరస్పర ప్రీతికి సాధనము. కనుకనే శిష్టాచారంలో ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

సుముహూర్త సమయంలో చూర్ణికను పఠించేటప్పుడు దానిలో మంగళ ద్రవ్యములను పఠించి, అవి మంగళ కరములు అగు గాక! అని అనుటచే ఆ సమయంలో మంగళద్రవ్య వాచక పదములను పఠించిన మాత్రం చేతనే మంగళ ప్రాప్తి కలుగుతుంటే మంగలమునూ , పావనమునూ అయిన బెల్లము, జీలకర్ర కలిపిశిరస్సునందు ఉంచుటవలన విశేషమైన శ్రేయః ప్రాప్తి అగునని వేరే చెప్పనవసరం లేదు.

సమీక్షణం
వరుడు వధువు ముఖాన్ని సుముహూర్త కాలంలో చూడడాన్నే సమీక్షణం లేక నిరీక్షణం అంటారు. వేదిక పైన వధువే తూర్పు ముఖంగా కూర్చుంటుంది. వరుడు పశ్చిమ ముఖంగా కూర్చుంటాడు. వీరిద్దరి మధ్యా అడ్డుగా తెల్లటి తేరసెల్లాను పట్టుకుంటారు. శుభ ముహూర్త కాలంలో వరుడు వధువుకనుబొమ్మల మధ్య అలక్ష్మీ తొలగుటకై దర్భలతో తుడిచి వధూవరులు ఒకరినొకరు వీక్షించుటను సమీక్షణం అంటారు. ఈ సమీక్షణ కార్యక్రమమును కులాచారమును బట్టి ఆచరించెదరు.

యుగాచ్చిద్రాభిషేకం
వివాహ సమయంలో దర్భను చుట్టగా చుట్టి వధువు శిరస్సు పై ఉంచి నాగలి కాడిని వధువు శిరస్సు పై ఉత్తర దక్షినములుగా ఉంచి నలుగురు బ్రాహ్మణులు ఆ కాడిని పట్టుకొని ఆ కాడి యొక్క ఉత్తరంవైపున ఉన్నా రంధ్రంలో మామిదికోమ్మను ఉంచి దక్షిణం వైపున ఉన్నా రంధ్రంలో బంగారపు మంగళసూత్రమును ఉంచి పాలను ఆ బంగారపు మంగళ సూత్రములపై ఐదు మంత్రములతో అబిషేకిన్చేదారు. ఆ పాలు వధువు శిరస్సు మీద పడాలి.
దర్భలు చుట్ట చుట్టి వధువు శిరస్సు పై పెట్టుటకు కారణం ఉన్నది. అది ఏమనగా "పవిత్రం వై దర్భాః అపామ్వా ఏష ఒషదీనాగుం రసో యద్దర్భాఃఅని శ్రుతులు దర్భలు పవిత్రమైనవని చెప్పాయి. కనుక వాటి చేత సంమార్జనం మంత్ర పురస్సరంగా చేయుటవలన అలక్ష్మీ నశిస్తుందని తాత్పర్యం.
ఈ విధంగా యుగాచ్చిద్రాభిషేకం చేయుటకు ఒక ఇతిహాసము ఉన్నది. పూర్వం అపాల అనే ఒక కన్య ఉండెడిది. ఆ కన్య బొల్లి రోగ గ్రస్తురాలు అగుట వలన ఎవ్వరూ ఆ కన్యను వివాహం చేసుకొనలేదు. కాని ఆమె మనస్సులో యజ్ఞంలో ఇంద్రుని పూజించాలి ఎలాగ?అని దిగులుతో ఉండేది. అంటే వివాహం చేసుకొని భర్తతో యజ్ఞంలో ఇంద్రునికి సోమరసాన్ని హోమం చేసే అదృష్టం ఎప్పటికైనా వస్తుందా? అని నిరంతరం మనస్సులో చింతిస్తూ ఉండేది. ఇలా ఉండగా ఒకరోజున స్నానానికి నదికి వెళ్ళింది. నదిలో దిగి స్నానం చేస్తుండగా ఆ నీటి వేగానికి కొట్టుకొని పోతుంది.
అంతలో దైవవశం చేత ఆ ప్రవాహంలో ఒక సోమలత తన వద్దకు కొట్టుకు వచ్చింది. నేను వివాహం చేసుకొని భర్తతో కలిసి యజ్ఞంలో సోమలతను శాస్త్రీయంగా దంపి ఆ రసాన్ని ఇంద్రునకిచ్చే భాగ్యం లేదుకదా! అని తన దగ్గరకు వచ్చిన సోమలతను దంతములతో నమిలి ఆ రసాన్ని ఇంద్రుని ఉద్దేశించి ఉమ్మి వేసింది. ఆమె భాగ్య వశం చేత ఆ సమయంలో ఇంద్రుడు ఆకాశంలో రథం మీద వెడుతూ శబరి వలె ఉన్న ఆమె భక్తి పారవశ్యానికి సంతోషించి రథముయొక్క కాడి వగైరాల నుండి ఆమెపై ముమ్మారు అమృత సేచనం చేసి బొల్లి రోగాన్ని పోగొట్టాడు. ఆమెను సూర్య వర్చస్సు కల దానినిగా చేసాడు. అందుచేత కాడి రంధ్రముల నుండి స్రవించే సువర్ణ సంసృష్టములైన ఉదకముల స్నానంచేత ఈ కన్యకు వర్చస్సును బోధించే "ఖేనసః" అనే మంత్రం చేత యుగము యొక్క చిద్రమును శిరస్సునందలి దర్భేణ్వమునందు   ఉంచాలి

Monday, April 20, 2009

వివాహం 4


శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపుడైన వరునకు పూజ
వరం అభ్యర్చ్య ........................... ఇదం వాం పాద్యం
శ్రీ లక్ష్మీనారాయణస్వరూపుడైన పెండ్లి కుమారునికి ఈ కూర్చ ఆసనము. లక్ష్మీనారాయణ స్వరూపుడవైన ఓ వరుడా! నీ రెండు పాదములను కడుగుటకు ఈ ఉదకము సుమా! అని ముందు కుడి కాలు, తరువాత ఎడమకాలు కడగాలి.
పెండ్లి కుమారుడు, అతని తరఫు పెద్దలు పెళ్ళికి తరలి వచ్చిన తరువాత కన్యాదాత సకుటుంబ సపరివారంగా సకల మంగళ వాద్య ఘోషలతో సమస్త సుగంధ పూజా ద్రవ్యములతో వారి దగ్గరకు వెళ్ళి వరపూజ చేస్తాడు.

శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపుడైన వరునికి ఈ క్రింది మంత్రంతో పాదప్రక్షాళణ చేస్తాడు.
ఓం నమోస్తు అనంతాయ ........ యుగధారిణే నమః
వేల కొలదీ రూపాలు, పాదాలు, కన్నులు, తలలు, తొడలు, బాహువులు, నామాలు, కిరీటాలు ధరించిన అనంతుడైన శాశ్వతుడైన పురుషోత్తమునకు నమస్కారం చేస్తున్నాను. కన్యను వారించడానికి మృగశిరా నక్షత్రంలో పెద్దలను పంపితే కన్యాదాత గౌరవానికి వాళ్ళు పాత్రులు అవుతారు. కార్యసిద్ధి కలుగుతుందని ఆపస్తంబ గృహ్య సూత్రం చెబుతోంది. దీనిని ఈనాడు వరాన్వేషణకు కూడా అన్వయించుకోవచ్చు. లక్ష్మీనారాయణ స్వరూపుడవైన ఓ వరుడా!ఇవి సుగంధ ద్రవ్యములు.అలంకార నిమిత్తం అక్షతలు. ఇవన్నీ నాశానరహితములై ఉండుగాక! అని వరునకు అర్చన చేయవలెను.

కాళ్ళు కడుగుట
లోకంలో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకు కాళ్ళు కడిగి పూజ చేయడం పరిపాటి. కాని ఇక్కడ వయస్సులో పెద్దవాడైన కన్యాదాత, అతని భార్య వరుని కాళ్ళు కడిగి పూజించి కన్యాదానం చేస్తారు. ఏమిట విశేషం? ఇందులో కన్యాదానం చేస్తున్నది శ్రీలక్ష్మీనారాయణ ప్రీతికోసం. వరుని  సాక్షాత్తు శ్రీలక్ష్మీనారాయణ స్వరూపుడుగా భావించమని సంప్రదాయం చెబుతోంది. కాబట్టి చిన్న వాడైన  అతనిలో గల శ్రీ లక్ష్మీ నారాయణుడికే కాళ్ళు కడగడం, పూజ చేయడం అని తెలుసుకోవాలి. అనగా భగవత్ మయంగా ఈ ప్రపంచాన్ని భావించాలి.

మన పెద్దవాళ్ళు ఏ పని చేసినా దేన్ని రూపొందించినా అందులో ఏదో ఒక తాత్వికభావన అంతర్లీనంగా ఉంటూనే ఉంటుంది. భారతీయ జీవన విధానంలో ఆ దృష్టి ఉండడం వల్లనే భారతీయ సంస్కృతీ ప్రపంచంలో సభ్య దేశాలన్నింటిలోనూ అద్వితీయంగా కొనియాడబడుచున్నది. పెళ్లి కొడుకు కాళ్ళు కడిగినప్పుడు ముందు కుడికాలును తరువాత ఎడమ కాలును ఇంద్రుని అంశంగా భావించి కడగాలి. తరువాత రెండు పాదాలను కలిపి కడగాలి.

కన్యాదానం
అన్ని దానాలలో కన్యా దానం చాలా గొప్ప దానం. ఇది మహా దానాలలో చేరుతుంది. కన్య తండ్రి కన్యాదానం చెయ్యబోయే ముందు ఇలా అంటాడు.

శ్లోకం:-
కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం.................... ప్రయతోహం ప్రయచ్చామి ధర్మకామార్ధ సిద్ధయే

బంగారంతో కూడుకొని ఉన్న, సర్వాభారణములతో అలంకరింపబడిఉన్న ఈ కన్యను నాకు బ్రహ్మలోక ప్రాప్తికి విష్ణు స్వరూపుడవైన నీకు ఇస్తున్నాను. ఓ అమ్మాయీ! మా ఎదుట ఉంది మీ తల్లికి చేదోడు వాదోడుగా ఉండే దానవు. ఓ అమ్మా! నాకు సమస్త సుశ్రూషలూ చేసేదానవు. అటువంటి నిన్ను దానం చేసి మోక్షం పొందాలనుకొంటున్నాను. శ్రీ మహావిష్ణువు, పంచ మహాభూతములు, బ్రహ్మాది దేవతల సాక్షిగా, పితృ దేవతలు తరించే నిమిత్తం ఈ కన్యాదానం చేస్తున్నాను. అలంకారములతో ఉన్నదీ సత్ స్వభావం గల ఈ కన్యను నిశ్చలమైన మనస్సుతో బుద్ధిమంతుడైన, సత్ప్రవర్తకుడైన వరునకు ధర్మార్ధ కామములు సిద్ధించడానికి ఇస్తున్నాను. సర్వాలంకార శోభిత, సాధ్వి, సుశీల, అయిన ఈ అమ్మాయిని ధర్మార్ధకామాలనే పురుషార్ధాలు సిద్ధించడానికి నియమ పూర్వకంగా ఈ బుద్ధిమంతునకు దానం చేస్తున్నాను. ఇదివరకటి వలెనే వధూవరుల గోత్రప్రవరలను చెప్పి వరుని చేతిలో జల ధారను పోస్తూ "నీతో కలిసిమెలసి అర్ధాంగిగా ఉండి సంతానాన్ని కని నీ వంశాన్ని వృద్ధి పొందించడానికి ఈ కన్యను నీకు దానం చేస్తున్నాను" అని చెప్పి వధువు తల్లిదండ్రులు కన్యాదానం చేస్తారు. వరుడు కన్యను పరిగ్రహించడం జరుగుతుంది. దానం సఫలం కావడం కోసం దక్షిణ సమర్పించబడుతుంది. అటు తరువాత సాలగ్రామ దానాన్ని కూడా చేస్తారు. కన్యాదాత వరునితో బాబూ! నీకు ఈమె అర్ధాంగి. ధర్మమైనా, అర్ధమైనా, కామమైనా మీరిద్దరూ కలిసి సంపాదించాలి. ఈమెను అతిక్రమించి వెళ్ళకు. అని పల్కిన తరువాత వరుడు అతిక్రమించను అని వారికి మాట ఇస్తాడు. (నాతిచరామి అంటాడు.)
మధుపర్కం
పెరుగు, తేనె సమంగా కలిపి ఒక కంచు పాత్రలో పోసి దానిపై కంచు మూత పెట్టి దారాలతో గట్టిగా బంధిస్తారు. దీనినే మధుపర్కం అంటారు. కొందరు దీనిలో నెయ్యి కలపాలని ఇంకొందరు దీనిలో అటుకులు కూడా కలపాలని కూడా చెబుతారు. ఈ మధుపర్కం ప్రధానంగా చేసే పూజ కాబట్టి దీనికి మధుపర్కపూజ అని పేరు వచ్చింది. కన్యాదాన కాలంలో వరునికి మధుపర్కం ఇస్తారు. ఇది గొప్ప గౌరవమన్న మాట. వధువు తండ్రి వరుని కాళ్ళు కడిగి అర్ఘ్యం ఇచ్చి మధుపర్కం ఇస్తాడు.వరుడు మధుపర్కాన్ని తీసుకొంటాడు. వరునికి వస్త్రాభరణాదులను  ఇస్తాడు.
సుముహూర్తము
ఈ సుముహూర్త కాలములో మంగలాష్టకములు, చూర్ణిక పఠించవలెను. ఇందు జీలకర్ర,బెల్లం కలిపి నూరిన మిశ్రమాన్ని వధూవరుల శిరస్సుపై పరస్పరము ఉంచుకొనుట ఆచారముగా వచ్చుచున్నది. ఇలా చేయుటలో విశేషం ఈ క్రింది శ్లోకంలో చెప్పబడుతోంది.

"జరా నో ప్రాప్యతే యస్మాత్ మంగళం శుభ కర్మసు"

ఈ జీలకర్ర ముసలితనం రాకుండా చేస్తుంది. కనుక శుభ కర్మల యందు మంగళకరమైనది. ఇది జరా ప్రతిబంధకము. సౌభాగ్య ద్రవ్యము. యౌవనాన్ని పోషిస్తుంది. కనుకనే దీనిని శిష్టులు కూడా పోషిస్తున్నారు. ఇది ఇంట ప్రశస్తమైనది కనుక మనం వంటలలో నిత్యం వాడుతున్నాము.

Wednesday, April 15, 2009

వివాహం 3


గోత్ర ప్రవరలు :-
గోత్రం అనగా వంశం. ప్రవర అనగా ఆ వంశ మూలపురుషుల కూటం. వరుడు కన్యా అన్వేషణ చేయమని అడిగిన తరువాత కొందరు పెద్దలు వెళ్ళి కన్యా దాతకు వరుని వంశాన్ని గురించి వివరించి చెప్పడాన్ని ఇక్కడ గోత్రప్రవరలు చెప్పడం అంటారు.
అంటే వరుని ముత్తాత, తాత, తండ్రి ఎవరెవరో కన్యా దాతకి తెలియజేసి కన్య ముత్తాత, తాత, తండ్రి ఎవరెవరో తెలిసికొని "మీ కన్యను మా వరునికి ధర్మ, సంతాన ,సంపద కోసం ఇవ్వండి" అని అడగడమే ఇక్కడ ప్రధానాంశం. ఆడపిల్లలు తక్కువగా ఉండే రోజులలో ఆడపిల్ల పుట్టడంతోనే సంబంధాలు కలుపుకోవాలని ఆలోచనలు ఉండేవి. అందువల్లనే పిల్లవాడి తరఫు వాళ్ళు వెళ్ళి "పిల్లనివ్వండి అని అడగవలసి వచ్చేది".ఇప్పుడు పరిస్ధితులు పూర్తిగా తారుమారు అయ్యాయి. మీకు ఏమి కావాలన్నా ఇస్తాం. మా పిల్లను చేసుకొంటారా అని కన్యాదాత బ్రతిమాలే రోజులలో మనం ఉన్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా మూడు మారులు ప్రవర చెప్పడం జరుగుతుంది. ధర్మ కార్యముల నిమిత్తం, సంతానంనిమిత్తం, ఇటువంటి వరునకు, ఇటువంటి కన్యను కోరుతున్నాము అని అర్ధము.
వృణీధ్వం అని కన్యాదాత పలుకవలెను. కన్యాదాత అలాగే మా కన్యను ఇస్తాను అని మూడు మారులు తన అంగీకారాన్ని తెలియజేస్తాడు.
"కృతార్థాః వయం ఇతి వరం ఆవేదయేయుః" అని చెప్పెదరు.
అనగా నీకు కన్యను వేదకుటలో మేము క్రుతార్దులమైతిమి అని మధ్యవర్తులైన పెద్దలు వచ్చి తమ నిర్ణయాన్ని వరునకు తెలియజేస్తారు. ఇప్పుడు పెండ్లిలోనే దీనిని జరుపుతున్నారు.ఈనాడు సంబంధ నిశ్చయానికి ముందు వరకూ జరిగే సంప్రదింపుల కార్యక్రమమే ఇది.
"ధర్మప్రజాసంపత్యర్ధం స్త్రియం ఉద్వహే" అని వరుడు అనవలెను.
 ధర్మ కార్య నిమిత్తం, సంతాన నిమిత్తం, సంపదను వృద్ధి చేసే నిమిత్తం ఈ స్త్రీని పెండ్లి ఆడుచున్నాను అని వివాహాంగభూతమైన ద్వితీయ యజ్ఞోపవీతాన్ని ధరిస్తున్నాను అని సంకల్పం చేస్తాడు. యజ్ఞోపవీత ధారణ అయిన తరువాత కన్యాదాత కన్యాదానము నిమిత్తము మహాసంకల్పం పఠించవలెను.

మహాసంకల్ప వివరణ

మనము ప్రతిపనీ చేసేటప్పుడు కరిష్యే అనడాన్ని సంకల్పం అంటారు. మానవ జీవితంలో వివాహమనేది ఒక ముఖ్యమైన సంస్కారం కాబట్టి, కన్యను ఇచ్చే తరానికి పది తరాలు వెనుక, పది తరాలు ముందు వరకు కన్యాదాన ఫలాన్ని అనుభవిస్తారు. కావున ఇక్కడ చేసే సంకల్పం చాలా విలక్షణమైనదిగా చెప్పబడింది. కనుకనే దీనిని మహాసంకల్పం అంటారు. మహాసంకల్పం విశ్వస్వరూపాన్ని చక్కగా వివరిస్తున్నది. ఇందులో ఖగోళ స్ధితి చక్కగా వివరించబడింది.భూమండలాన్ని పరిపాలించిన షోడశ మహారాజులు, షట్చక్రవర్తులు, సప్త ద్వీపాలు, నవవర్షాలు, నవఖండాలు, దశారణ్యాలు, యాభై కోట్ల విస్తీర్ణం గల జంబూ ద్వీపం, అందులో భారతవర్షం భారతఖండంలో ఈ కన్యాదానం ఎక్కడ చేస్తున్నదీ కన్యాదాత పేర్కొంటాడు. అలాగే బ్రహ్మకాలమాన ప్రకారం యాభై సంవత్సరాలు పూర్వార్ధం గడువగా, యాభై ఒకటవ సంవత్సరంలో, మొదటి మాసంలో , మొదటి పక్షంలో, మొదటి పగటిలో బ్రహ్మకు ప్రాణాయామ కాలం ప్రస్తుతం జరుగుతున్నట్లు చెప్పి తొమ్మిది కల్పములలో శ్వేతవరాహ కల్పంలో, పద్నాలుగు మన్వంతరములలో ఏడవదైన వైవస్వత మన్వంతరంలో శాలివాహన శకంలో ఇరవై ఎనిమిదవ మహా యుగంలో కలియుగంలో ఫలానా సంవత్సరంలో ఫలానా మాసంలో ఫలానా తిథి రోజున ఈ సుముహూర్త సమయంలో శ్రీ లక్ష్మీనారాయణ ప్రీతి కోసం సర్వాలంకార భూషిత ఐన ఈ కన్యను దానం చేస్తున్నాను.

ఈ కన్యాదానం వలన నాకు బ్రహ్మలోకంలో నివసించే యోగ్యత సిద్ధించాలి. అగ్నిష్టోమ, వాజపేయాది యాగాలు చేసిన పుణ్య ఫలం లభించాలి. నాకు వెనుక,ముందు పది తరాల వాళ్ళు బ్రహ్మ లోకంలో నివసించాలి. అని కన్యాదాత సంకల్పం చేస్తాడు. వివాహ సమయంలో చేసే మహా సంకల్పంలో మనం అర్ధం చేసుకోవలసిన విషయం ఏమిటంటే మహాకాలంలో, మహావిశ్వంలో మానవుడు ఎంత చిన్నవాడో అర్ధం చేసుకోవడానికి అహంకారాన్ని తగ్గించుకొని వినయవిధేయతలు పెంచుకొని కర్తవ్యపరాయణుడై  ధర్మానికి కట్టుబడి ఉండడానికి ఎంతో ఉపయోగపడుతుంది.

Monday, April 13, 2009

వివాహం 2


స్నాతకవ్రతం
విద్యాభ్యాసం కొరకు విద్యార్థిని గురుకులంలో చేర్చి , విద్యాభ్యాసం పూర్తి ఐన తరువాత గురువు ఆ శిష్యునకు స్నాతకవ్రతము చేసి నీకు విద్య పూర్తిఅయినది కావున నీవు తదుపరి వివాహము చేసుకొని గృహస్థాశ్రమము స్వీకరించవలెను అని స్నాతకవ్రతము చేసి గురుకులం నుండి గృహమునకు పంపించును.
గురుకులంలో బ్రహ్మచర్యాశ్రమాన్ని కష్టపడి దీక్షతో విద్యలన్నీ అభ్యసించి గృహస్థాశ్రమంలో ప్రవేశించమని గురువు ఆదేశించిన తరువాత స్నాతకవ్రతం చేయాలి.అన్ని దీక్షలను వదిలేసి క్షురకర్మ చేయించుకుని వేడినీళ్ళతో స్నానం చేసినవాడు స్నాతుడవుతాడు. అది ఈ వ్రతంలో ముఖ్య క్రియ కాబట్టి దీనికి స్నాతక వ్రతమని పేరు.ఇట్టి స్నాతక వ్రతములు నలందా, తక్షశిల మొదలగు విశ్వవిద్యాలయాలలో ఆచరించేవారు.దీన్ని ఈనాడు విశ్వవిద్యాలయాలలో స్నాతకవ్రతమని నామమాత్రంగా జరుపుతున్నారు.తైత్తిరీయోపనిషత్తు స్నాతకునికి గురువు చేయవలసిన ఉపదేశాన్ని ఇలా పేర్కొంటున్నది.

మంత్రం:- వేదమనూచ్యాచార్యో అంతేవాసినమనుశాస్తి సత్యంవద ధర్మంచర స్వాధ్యాయాన్మా ప్రమదః

వేదాధ్యయనం పూర్తి చేయించి గురువు శిష్యుణ్ణి ఇలా శాసిస్తున్నాడు.సత్యం మాట్లాడు. ధర్మాన్ని ఆచరించు.నేను నేర్పిన విద్యను తిరిగి అధ్యయనం చేయడంలో అశ్రద్ధ చేయకు. ఆచార్యునికి ఇష్టమైన గురు దక్షిణను సమర్పించి నీ వరకు వచ్చిన మానవ సంతతి అనే దారాన్ని తెంపి వేయకు.అంటే గృహస్థాశ్రమాన్ని స్వీకరించి యోగ్యమైన సంతానాన్ని, విజ్ఞానాన్ని ఉపదేశించి విద్య సంతతిని కూడా పెంపొందించు.అయితే ఈ గృహస్థాశ్రమ నిర్వహణ చాల కష్టమైంది.ఎన్నో భ్రమలు, పొరబాట్లు రావడానికి అవకాశం ఉంది. కనుక నైపుణ్యాన్ని ప్రదర్శించడంలో పొరబడకు.అభ్యుదయ సాధనలో పొరబడకు.వేదాన్ని అధ్యయనం చెయ్యడంలోను లేక జ్ఞానాన్ని సంపాదించడం లోనూ ఇతరులకు వేదాన్ని నేర్పడంలోనూ లేక ఇతరులకు విజ్ఞానాన్ని ఉపదేశించడంలోను ఏమరుపాటు పడకు.

మంత్రం:-మాతృ దేవో భవ, పితృ దేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ
తల్లిని దైవంగా అర్చించు.తండ్రిని దైవంగా ఆరాధించు. గురువునుదైవంగా గౌరవించు.అతిథిని దైవంగా ఆదరించు.

యాని అనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని. నో ఇతరాణి. యాని అస్మాకగ్0  సుచరితాని తాని త్వయా ఉపాస్యాని. నో ఇతరాణి

మంచి పనులను, మహనీయులు చెప్పిన వాటిని ఆచరించు. చెడ్డ పనుల జోలికి పోవద్దు. మేమాచరిస్తున్న మంచి పనులను నీవు కూడా ఆచరణలో పెట్టు. ఇతరమైన వాటి జోలికి పోవద్దు. మనదగ్గరికి శ్రేయోభిలాషులు, బ్రహ్మజ్ఞానంతో ప్రకాశించే బ్రాహ్మణులు వస్తే వాళ్ళను ఆహ్వానించి ఆతిథ్యమిచ్చి ఆదరించు. ఏదైనా ఎవరికైనా ఇచ్చేటప్పుడు శ్రద్ధతో ఇవ్వు. అశ్రద్ధతో ఇవ్వద్దు. నీ సిరిసంపదలకు తగినట్లు దానం చెయ్యి.అయ్యో!ఇంతే ఇవ్వగలుగుతున్నానే అని సిగ్గు పడుతూ ఇవ్వు. భయపడుతూ ఇవ్వు. తీసుకొనే వ్యక్తిలో భగవంతుణ్ణి చూస్తూ ఇవ్వు.
నీవు చేసే సత్కార్యాలలో గానీ, నీ నడవడిని గురించి గానీ సందేహాలు కలిగినప్పుడు నీతో పాటు దార్మికజీవనాన్ని గడుపుతూ సమభావన కలిగి భగవద్భక్తితో, ధర్మబద్ధమైన కోరికలతో ఏ లోపం లేకుండా చక్కని వివేకంతో ప్రతి విషయాన్ని విమర్శించి ఒక నిర్ణయానికి రాగల బ్రహ్మజ్ఞానులైన పెద్దలు, ఆ పరిస్ధితులలో ఎలా ప్రవర్తించారో తెలుసుకొని నీవుకూడా అలాగే ప్రవర్తించు.
ఇక ఇతరులలో తప్పులు కనపడినప్పుడు, వాళ్ళను నిందించాల్సివచ్చినప్పుడు కూడా సమభావనతో దైవభక్తితో ధార్మికమైన అభిలాషలతో ఏ లోపం లేకుండా ప్రతి విషయాన్ని విచక్షణా జ్ఞానంతో విమర్శించి నిర్ణయించగల బ్రహ్మజ్ఞానులైన బ్రాహ్మణులు ఆ సందర్భంలో ఎలా నడచుకోన్నారో తెలిసికొని నీవు కూడా అలా ప్రవర్తించు. ఇదే మా ఆదేశం.ఇదే మా ఉపదేశం. ఇదే వేదసారభూతమైన ఉపనిషత్. ఇదే మా అనుశాసనం. ఇలాగే సాధన చెయ్యి.ఇలాగే సంస్కారాన్ని పెంచుకొంటూ మళ్ళా మళ్ళా సాధన చెయ్యి.
ఆహా!ఎంత చక్కటి ఉపదేశం. ప్రాచీన భారతదేశంలో బ్రహ్మచర్యాన్ని చక్కగా పూర్తిచేసి విద్యలను సంపాదించి పెండ్లి చేసుకొని గృహస్థుగా మారి ఈ సమాజసేవకు అంకితమయ్యే అంతేవాసికి గురువు చేసే ఉపదేశమిది . అతడి బ్రతుకుకు ఆచార్యుడు వేసే బంగారు బాట ఇది. విద్యా బుద్ధులతో నీతి నియమాలతో, భక్తి విశ్వాసాలతో, సేవా సంస్కారాలతో తన శిష్యుణ్ణి తీర్చిదిద్ది ఈ సమాజానికి అంకితం చేస్తున్నాడు గురువు స్నాతకోత్సవంలో. ఒక్కసారి ఆలోచిచండి.!భారతీయ సంస్కృతి ఎంత ఉదాత్తమైన విలువలతో నిండి ఉన్నదో!
స్నాతక సమయంలో ఆచార్యుడు అందించిన ఉపదేశంలో "ఇంత వరకూ నీ వంశస్దులు మంచి సంతానాన్ని సమాజసేవ కోసం అందిస్తూ వచ్చారు.భావి జీవితాన్ని భాసురంగా తీర్చిదిద్దుకొని ఇతరులకు సేవ చేసే విజ్ఞానాన్ని సంపాదించావు కాబట్టి నీ వరకు వచ్చిన ఈ సంతాన లతను త్రెంచివేయకుండా నీ పితరుల ఋణాన్ని తీర్చుకోవడానికి మంచి సంతానాన్ని పొందాలి. అందుకోసమే గృహస్దాశ్రమాన్ని స్వీకరించు!అనే మాటలకు కట్టుబడి ఆయన అనుమతిని తీసుకొంటాడు. స్నాతకుడు ఆ తరువాత గురు దక్షిణతో పాటు ఆవు, దూడ, ఎద్దు మొదలగు వాటిని ఆయనకు సమర్పించి అప్పటినుంచి ఒక సంవత్సరం వ్రతదీక్షలో ఉంటాడు.

కాశీ ప్రయాణం
కాశీ యాత్రకు బయలుదేరిన స్నాతకుడిని కన్యాదాతగానీ, లేక పెండ్లికుమార్తె సోదరుడు గానీ, "సర్వాలంకార భూషిత ఐన మా కన్యను మీకిచ్చి వివాహం చేస్తాము.అగ్ని సాక్షిగా పాణిగ్రహణం చేయండి.దయతో మా ఇంటికి రండి " అని ఆహ్వానిస్తాడు. అందుకు అంగీకరించి వరుడు ఇంటికి బయలు దేరుతాడు.

వరాగమనం
సుముహూర్తం నిశ్చయమైన తరువాత తగినంత ముందుగా వరుడు బంధుమిత్రులతో కలిసి మంగళ గీతవాద్యాలతో ,శుభ శాకునాలతో కన్యాదాత ఇచ్చిన విడిది ఇంటికి తరలి వెళ్ళడమే వరాగమనం అంటారు. అతని వెంట పెద్దలు, బ్రాహ్మణులు , ముత్తైదువులు, బంధువులు, మిత్రులు కూడా బయలుదేరి వెడతారు.

ఈ మొత్తం కార్యక్రమాన్ని ఈ క్రింది శ్లోకములతో వివరించవచ్చు.

1.చరితబ్రహ్మచర్యోహం కృత వ్రత చతుష్టయ:

కాశీ యాత్రాం గమిష్యామి అనుజ్ఞాం దేహిమే శుభాం

౨.సాలంకారాం   మమ సుతాం కన్యాం దాస్యామి తే ద్విజ

పాణిం గృహీత్వా సాగ్నిస్త్వం గచ్చస్వ  ఆగచ్చ మద్గృహం

వివాహ సంస్కార విమర్శ

ధర్మ, అర్థ, కామ, మోక్షములనేవి పురుషార్ధములు నాలుగు.అతిశయముగా పొందబడేవి గనుక వీటిని పురుషార్ధములు అంటారు.ఇందులో ధర్మ, అర్థ, కామములకు వివాహం ఏర్పాటు అయ్యింది. మోక్షమునకు స్త్రీ సహాయం ఆపేక్షించనక్కరలేదు. మిగిలిన ధర్మ, అర్థ, కామములనే మూడు పురుషార్ధములకు స్త్రీ సంబంధం ఆపేక్షించాలి.  

వరుడు పాణి గ్రహణాఖ్యం కర్మ కరిష్యే. అని పాణిగ్రహణానికి సంకల్పం చేసి, పాణి గ్రహణాంగత్వేన వరాన్ ప్రేషయిష్యే

మదర్థం కన్యాం వృణీధ్వమితి చతురో బ్రాహ్మణాన్  శ్రుత శైలి విత్త సంపన్నాన్, సమవేతాన్ కార్య కుశలాన్ వరాన్ ప్రహ్ణీయాత్ .
నాకు తగిన కన్యను అన్వేషించే నిమిత్తం నలుగురు బ్రాహ్మణులను పంపుచున్నాను.
మంచి హృదయం గలవారు ఉభయ పక్షముల క్షేమం కోరేవారు, వేదవేత్తలు, మంచి ఆలోచనాపరులైనవారు, అయిన పెండ్లి మాటలు మాట్లాడే బ్రాహ్మణులను తనకు తగిన కన్యను వెదకి తీసుకొని రమ్మని పంపాలి.

నా నిమిత్తం కన్యను వరింపుడు అని వారికి దారి ఖర్చులు వగైరాలకు హిరణ్యం ఇవ్వడం ఆచారంగా ఉంది. దీనినే కన్యావరణం అంటారు.ఈ రకంగా నలుగురిని ఎన్నుకుని పంపాలి. కన్యావరణం అనగా మంచి లక్షణాలు గల కన్యను నిర్ణయించుకోవడం. ఇద్దరు లేక నలుగురు లేక ఎనిమిది మంది యోగ్యులు గృహస్థులైన మిత్రులను వరుడు తన కోసం మంచి కన్యను విచారించి నిర్ణయించమని కోరతాడు. అతని కోరిక మేరకు వాళ్ళు వెళ్ళి విచారించి తగిన కన్యను నిర్ణయిస్తారు.

మంత్రం:ప్రసుగ్మంతా ........ దేవః

అనే మంత్రములను చెప్పుచూ ఆ నలుగురూ కన్యాదాతను సమీపించి వరుని ప్రవరాదులు (గోత్ర , నామాలు )చెప్పాలి.