Tuesday, April 21, 2009

వివాహం 6


తరువాత ఆ కాడి యొక్క రంధ్రమందు శంతే హిరణ్యం అను మంత్రం చేత, సువర్ణమును అంతర్ధానం ఉంచాలి. సువర్ణమును పెట్టి అభిషేకం చెయ్యడానికి కారణం శృతి ఇలా చెబుతోంది.
పూర్వం వరుణుని యొక్క ఇంద్రియ సామర్ధ్యాన్ని ఉదకములు బయటకు వెళ్ళగొట్టాయి. అలా బహిర్గతమైన వీర్యం సువర్ణరూపందాల్చింది. అందుచేత ఇంద్రియసామర్ధ్యం బహిర్గతం కాకుండా ఉండడానికి సువర్ణం పెట్టి అభిషేకం చెయ్యాలని చెప్పి, తరువాత సువర్ణం నుండి స్రవించిన ఉదకములు ఆయుర్వృద్ధి హేతువులుగా బోధిస్తోంది.
హిరణ్య దానం చేత అపమృత్యువు పోతుంది. కనుక హిరణ్యం ఆయు స్వరూపం. అటువంటి హిరణ్య సంయుక్తములైన ఉదకములు ఆయువును వృద్ధి పరుస్తాయి.ఆ ఉదకములే యజమానిని గూర్చి స్రవిస్తాయి.
అలాగే హిరణ్యం దీప్తి కలది. కనుక అటువంటి హిరణ్య సంబంధం చేత తేజస్సంపాదకములైన ఉదకములే ఈ యజమానుని గూర్చి స్రవిస్తాయి. సువర్ణాభరణ సంబంధం వల్ల దేహం శోభిస్తుంది. కనుక సువర్ణ సంబంధం చేత వర్చో హేతువులైన ఉదకములు ఈ యజమానుని గూర్చి స్రవించును. ఈ విధంగా ఆయుస్సు, వర్చస్సు, తేజస్సులకు సాధనమైన హిరణ్యమును ప్రాకృతంలో కాడి యొక్క రంధ్రములో ఉంచి ఆ సువర్ణం ద్వారా స్రవించే ఉదకము వధువు యొక్క శిరస్సు యందు పడుటచే హిరణ్యము, ఉదకములు, కాడి మొదలైనవి ఆయురాది సంపాదన ద్వారా సుఖసంధాయకములని పై శృతి తెలియజేస్తోంది. ఓ కన్యా! ఈ హిరణ్యం, ఈ ఉదకములు, ఈ యుగచ్చిద్రం మొదలైనవి నీకు సుఖకరములు అగు గాక!

యోక్త్ర బంధనం
వివాహంలో ఆశాసానా అను మంత్రం చేత వధువు నడుమునకు దర్భత్రాడు కడతారు. దర్శపూర్ణ మాసేష్టులనే శ్రౌత కర్మలో ఈ మంత్రం పత్నికి యోక్త్ర బంధనం చేసేటప్పుడు చెబుతారు. ఎవని యొక్క పత్ని అగ్నికి అనువ్రతురాలవుతూ అనుసారిణి అవుతూ సౌమనస్యాన్ని, సంతానాన్ని, సౌభాగ్యాన్ని, శోభన సన్నివేశమైన శరీరాన్ని కోరుతుందో ఆ పత్నిని శోభన కర్మకు సుఖమయ్యేలా యోక్త్రం చేత బంధించుచున్నాను. యోక్త్ర బంధన సమయంలో పై మంత్రాన్నుచ్చరిస్తూ ఉండడం చేత ఈ పత్నిని యజ్ఞ  యోగ్యురాలుగానూ, పాప రహితురాలుగానూ చేసి సత్యమైన ఆశీస్సుతో సంరుద్ధురాలుగా చేయుచున్న వాడవుతాడు. ఈ విషయంలో విద్యారణ్యులవారు ఇలా వివరించారు.
"యథా వివాహే స్త్రియః కంఠే మంగళసూత్రం లింగం తద్వత్. అస్మిన్నర్థే  లౌకిక వైదిక ప్రసిద్ధిం దర్శయతి."

లోకంలో వివాహమందు స్త్రీ కంఠమందు మంగళసూత్రం ఏ వ్రత స్వీకరణ చిహ్నంగా ఉన్నదో అలాగే దర్శపూర్ణ మాసేష్టులలో పత్నికి యోక్త్ర బంధనం అనువ్రత స్వీకార చిహ్నమన్న మాట.

సామాన్యంగా సూత్రధారణం లోకంలోనూ, వేదం లోనూ కూడా నియమ స్వీకారమందు చిహ్నము. ఎలాగా అంటే లోకంలో ఎక్కడో దూరదేశ మందున్న దేవతా దర్శనాన్ని చేయ సంకల్పించిన వారు సూత్రం కట్టుకునే ఆచారం ఉన్నది.వేదంలో కూడా ఉపనయనంలో మౌంజిని (ముంజి గడ్డిచే నిర్మితమైన త్రాడును) వటువునకు కడుతున్నారు. కనుక యాగమును తెలిసినవారు, తెలియనివారు అందరూ ఇలా అంటున్నారు .ఏమని అంటే ఈ పత్ని యోక్త్రమును ముఖ్యంగా ధరించుచున్నది.ఏ భర్తను అనుసరించి ఈమె వ్రతమును స్వీకరించి ఉన్నదో అతని సంబంధమైన మంగలసూత్రముతో పరలోకమందు కూడుకొన్నది అయి ఉంటుంది. దీనివలన వివాహమందు స్త్రీకి మంగళ సూత్రం అనూచానంగా ఆచారమిచ్చినట్లు స్పష్టమవుతోంది. తరువాత ఇష్టిలో యోక్త్రమును పత్నికి ముడి వేయుట వలన ఆశీస్సులను ఈ పత్నియందు పరిగ్రహించిన వాడు అవుతాడు.

No comments:

Post a Comment